Telugu Global
Andhra Pradesh

తిరుమలలో ఇక స్టీల్ హుండీలు..

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హుండీలను ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ హుండీ ఎత్తు 5 అడుగులు. భక్తులు మూడు వైపులనుంచి కానుకలు వేసే అవకాశం ఉంటుంది.

తిరుమలలో ఇక స్టీల్ హుండీలు..
X

తిరుమలలో హుండీల విషయంలో ఓ సంప్రదాయం ఉంది. దేవదేవుడికి నివేదించే ప్రధాన హుండీతోపాటు, ఉపాలయాల్లో కూడా హుండీల ఏర్పాటు ప్రత్యేకంగా ఉంటుంది. తెల్లటి వస్త్రంతో తయారు చేసిన కొప్పెరలో భారీ గంగాళాలు వేసి ఇత్తడి హుండీలు ఏర్పాటు చేస్తారు. వీటిని ట్రాలీలపై ఉంచి సిబ్బంది ఆలయం నుంచి బయటకు తెస్తారు. లారీలో ఎక్కించి పరకామణికి తరలించి లెక్కిస్తారు. ఇలా తరలించే విషయంలో సమస్యలు ఎదురవడంతో కొత్తగా స్టీల్ హుండీలను తెరపైకి తెచ్చింది టీటీడీ. శనివారం నుంచి ప్రయోగాత్మకంగా వీటిని తిరుమలలో ఏర్పాటు చేశారు.

ఇటీవల తిరుమల ఆలయం నుంచి హుండీని ట్రాలీలో బయటకు తరలిస్తుండగా ఓవైపు ఒరిగిపోయి కిందపడిపోయింది. దీంతో అపచారం జరిగిందంటూ భక్తులు ఆందోళన చెందారు. వెంటనే సర్దుబాటు చేసిన టీటీడీ సిబ్బంది హుండీని తరలించారు. ఆ తర్వాత హుండీల ఏర్పాటు, వాటి భద్రతపై అంతర్గత చర్చ జరిగింది. అందులో భాగంగానే కొత్త రకం హుండీలను ఏర్పాటు చేశారు.

ప్రయోగ దశలో..

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హుండీలను ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ హుండీ ఎత్తు 5 అడుగులు. భక్తులు మూడు వైపులనుంచి కానుకలు వేసే అవకాశం ఉంటుంది. చేయి లోపలికి పెట్టకుండా మధ్యలో స్టీల్ రాడ్ ఏర్పాటు చేశారు. వీటిని కొద్దిరోజులపాటు పరిశీలించి తర్వాత పూర్తి స్థాయిలో పాతవాటి స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భక్తులనుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

First Published:  30 July 2023 4:27 PM IST
Next Story