ఏపీలో కూడా 5జీ సేవలు ప్రారంభించండి.. కేంద్రానికి ఎంపీ విజయ సాయిరెడ్డి విజ్ఞప్తి
'ఏపీలో 5జీ సేవల విస్తరణను వేగవంతం చేయాలని టెలికాం శాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ కి విజ్ఞప్తి చేస్తున్నా. వైజాగ్, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో వాణిజ్యం, కమ్యూనికేషన్ కోసం 5జీ సేవలను ఉపయోగించుకోవడానికి వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఏపీలో 5జీ సేవలు ప్రారంభించాలని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ టెలికాం రంగంలో ఈ నెల ఒకటవ తేదీన 5జీ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మొదట 5జీ సేవలు దేశంలోని 13 ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలిపారు. ఆ 13 నగరాలకు గాను 4 నగరాల్లో 1వ తేదీనే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
కాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తుండగా.. అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక్క నగరం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ విజయసాయిరెడ్డి టెలికాం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కు ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
'ఏపీలో 5జీ సేవల విస్తరణను వేగవంతం చేయాలని టెలికాం శాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ కి విజ్ఞప్తి చేస్తున్నా. వైజాగ్, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో వాణిజ్యం, కమ్యూనికేషన్ కోసం 5జీ సేవలను ఉపయోగించుకోవడానికి వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఏపీలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించడం ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారని నేను భావిస్తున్నాను' అని విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Requesting Telecom Minister Shri @AshwiniVaishnaw to expedite 5G rollout in AP. Cities like Vizag, Vijayawada and Tirupati have lakhs of customers interested in using 5G services for trade and communication. I am sure the service providers will immensely benefit too.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2022
కాగా దేశంలో తొలి దశలో 5జీ సేవలు ప్రారంభం అయ్యే నగరాల్లో అహ్మదాబాద్ బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై, పూణే, జామ్ నగర్, కోల్ కతా, లక్నో ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నగరం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని నగరాల్లో కూడా 5జీ సేవలు ప్రారంభించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.