వచ్చే ఎన్నికల్లో స్టార్ వార్ తప్పదా?
వైసీపీ తరపున కర్త, కర్మ, క్రియా అంతా జగనే అని అందరికీ తెలుసు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ తరపున కొందరు స్టార్ హీరోలు రంగంలోకి దిగవచ్చు. రంగంలోకి దిగటమంటే పోటీలోకి కాదు ప్రచారం చేసి గెలిపించేందుకే.
వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం స్టార్ వార్ తప్పేట్లు లేదు. ఇక్కడ స్టార్లంటే పొలిటికల్ స్టార్ అని వైసీపీ చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, రీల్ స్టార్లుగా పాపులర్ అయిన హీరోలు కొంతమంది మాత్రమే. వైసీపీ తరపున కర్త, కర్మ, క్రియా అంతా జగనే అని అందరికీ తెలుసు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ తరపున కొందరు స్టార్ హీరోలు రంగంలోకి దిగవచ్చు. రంగంలోకి దిగటమంటే పోటీలోకి కాదు ప్రచారం చేసి గెలిపించేందుకే.
టీడీపీ తరపున హిందుపురం ఎమ్మెల్యేగా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా రాజేంద్రప్రసాద్ లాంటి కొంతమంది ప్రచారం చేసే అవకాశాలున్నాయి. నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది. అలాగే జనసేన తరపున అధినేత పవన్ కల్యాణ్ కాకుండా మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా కాంపౌండ్లో చాలామంది ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికలు పవన్‌కు చాలా కీలకమైనవి కాబట్టి.
ఇక బీజేపీ తరపున ప్రభాస్ ప్రచారం చేస్తారనే ప్రచారముంది. నరసాపురం లేదా కాకినాడ ఎంపీగా ప్రభాస్ తమ్ముడు ప్రభోద్ రాజు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి తమ్ముడికి మద్దతుగా ప్రభాస్ ప్రచారం చేస్తారట. ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీ, జనసేన, బీజేపీ తరపున సినీ రంగం నుండి ఎవరు ప్రచారం చేసినా అదంతా జగన్‌కు వ్యతిరేకంగానే ఉంటుంది. వ్యతిరేక బ్యాచ్‌లో మోహన్‌బాబు కూడా కలిసే అవకాశముంది. కాకపోతే ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తారనే విషయం తెలీదు.
ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు తటస్ధంగా నెట్టుకొస్తున్నారు. వీళ్ళలో నాగార్జున, మహేష్ బాబుకు జగన్‌తో మంచి సంబంధాలే ఉన్నా మద్దతుగా నిలుస్తారని ఎవరు అనుకోవటం లేదు. టీడీపీ తరపున కొందరు నిర్మాతలు, డైరెక్టుర్లు కూడా ప్రచారంలోకి దిగే అవకాశముంది. ఏదేమైనా గతంలో ఎప్పుడూ లేనట్లుగా వచ్చే ఎన్నికల్లో స్టార్లు రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.