జగన్‌కు స్టాలిన్ లేఖ.. సరిహద్దుల్లో ఆనకట్టలపై అభ్యంతరం..
ఒకవేళ నిర్మాణాలు చేపట్టాలంటే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. ఏకపక్షంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని విజ్ఞప్తి చేశారు.
ఏపీ సీఎం జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ లేఖను రాశారు స్టాలిన్. కొసస్తలయర్ నది గురించి ఆయన ప్రస్తావించారు. చెన్నై నగరం గుండా వెళ్లే మూడు ప్రధాన నదుల్లో ఇది కూడా ఒకటి. తిరువల్లూరులోని పల్లిపట్టుతో మొదలైన ఈ నది ప్రయాణం బంగాళాఖాతంతో ముగుస్తుంది. అయితే ఈ నదికి ఉపనదిగా ఉన్న నగరి నది ప్రవాహం చిత్తూరు జిల్లా నుంచి వెళ్తుంది. ఈ రెండు పూండి రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో కలుస్తాయి. అయితే ఇప్పుడు కొసస్తలయర్ నదిపై ఏపీ అక్రమంగా రిజర్వాయర్లు నిర్మిస్తోందని, ఈ ఆనకట్టల నిర్మాణం వెంటనే ఆపాలంటూ డిమాండ్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్.
సరిహద్దుల్లో ఉన్న ముక్కల కలందిగయ్, కథరాపల్లి గ్రామాల సమీపంలో ఏపీ ప్రభుత్వం రిజర్వాయర్లు నిర్మిస్తోందని తమిళనాడు ఆరోపిస్తోంది. ఈ రిజర్వాయర్ల వల్ల పూండి రిజర్వాయర్‌కు చేరుకునే నీటి శాతం తగ్గిపోతుందని, చెన్నైకి మంచినీటి కష్టాలు మొదలవుతున్నాయని ఆరోపించారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఒకవేళ నిర్మాణాలు చేపట్టాలంటే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. ఏకపక్షంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని విజ్ఞప్తి చేశారు.
చెన్నైకి తాగునీటిని అందించే పూండి రిజర్వాయర్‌కు ఏపీ ప్రతి ఏటా నీటిని విడుదల చేస్తోంది. పెన్నా నది నీటిని సోమశిల రిజర్వాయర్ నుంచి తెలుగు గంగ కాల్వ ద్వారా విడుదల చేస్తారు. పెన్నాకి వరదలు వచ్చినప్పుడు పూండి రిజర్వాయర్‌కు సమృద్ధిగా నీరు సరఫరా అవుతోంది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఏపీ ప్రభుత్వానికి లేఖల రూపంలో విన్నపాలు పంపిస్తుంటాయి. తాజాగా సరిహద్దు నదిపై నిర్మించే రిజర్వాయర్ల విషయంలో గొడవలు రావడం ఇదే ప్రథమం.