ఏపీ ఉద్యోగుల జీతాలకు రాష్ట్ర విభజనకు సంబంధం ఉందా..?
‘రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కొవిడ్ పరిస్థితులవల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెలా 5వ తేదీ నాటికి 90-95 శాతం ఉద్యోగులకు జీతాలు, పింఛన్లను ప్రభుత్వం చెల్లిస్తోందని ప్రకటించారు రావత్.
అమ్మో ఒకటో తారీఖు అంటూ ఏపీ ఉద్యోగులు హడలిపోతున్నారని, జీతాలు సకాలంలో అందేలా చూడాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఇటీవల ఏపీ గవర్నర్ ని కలసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో సంఘం విమర్శలు చేయడం, టీడీపీ అనుకూల మీడియాలో జీతాల ఆలస్యంపై వరుస కథనాలతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. తాజాగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ప్రభుత్వం తరపున ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ ప్రకటలో ఉద్యోగుల జీతాలతో ఆయన ముడిపెట్టిన అంశాలు ఆసక్తిగా మారాయి. రాష్ట్ర విభజన అంశం కూడా రావత్ ప్రకటనలో వెలుగుచూడటం విశేషం.
‘రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కొవిడ్ పరిస్థితులవల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెలా 5వ తేదీ నాటికి 90-95 శాతం ఉద్యోగులకు జీతాలు, పింఛన్లను ప్రభుత్వం చెల్లిస్తోందని ప్రకటించారు రావత్. మిగిలిన 5శాతం మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయని వివరించారు. బిల్లులు నెలాఖరులోగా వస్తే ఒకటో తేదీకే జీతాలు అకౌంట్లలో పడతాయని వివరించారు.
పరువునష్టం దావా వేస్తాం జాగ్రత్త..
గత ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి ఉందని వివరించారు రావత్. అయితే ఈసారి పనిగట్టుకుని కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని పత్రికలు పనికట్టుకొని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించకుండా వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ రాస్తున్న కథనాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గతంలో నెలల తరబడి జీతాలు అందేవి కావని, ఈ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ఆప్కోస్ పేరుతో కార్పొరేషన్ ను సైతం ఏర్పాటు చేసిందని వివరించారు రావత్. ఉద్యోగుల జీతాల చెల్లింపుపై తప్పుడు కథనాలను ఎవరూ నమ్మొద్దని, ఉద్యోగుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారాయన. అంతా బాగానే ఉన్నా అశాస్త్రీయ విభజన అంటూ రావత్ ప్రకటించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.