మంచి భవనాలైతే కట్టాం.. రోడ్లే లేవు - అమరావతిపై ఎస్‌ఆర్‌ఎం వ్యవస్థాపక ఛాన్స్‌లర్
వర్సిటీ రెండో స్నాతకోత్సవంలో ప్రసంగించిన పారివేందర్.. రోడ్ల పరిస్థితి బాగలేకపోవడంతో ఇక్కడికి రావాలంటే అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితికి నేను.. మీరు బాధ్యులం కాదంటూ విద్యార్థులు, సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అమరావతిలో రోడ్ల పరిస్థితిపై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్స్‌లర్ టీ.ఆర్.పారివేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆహ్వానం మేరకు తాము ఇక్కడికి వచ్చి వర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 200 ఎకరాల్లో మంచి భవనాలు నిర్మించామని.. అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన చేసే టీచర్లను తెచ్చామని, మంచి పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేశామని.. అన్నీ బాగానే ఉన్నా ఇక్కడికి వచ్చేందుకు రోడ్లు మాత్రం బాగోలేవని ఆయన వ్యాఖ్యానించారు.
వర్సిటీ రెండో స్నాతకోత్సవంలో ప్రసంగించిన పారివేందర్.. రోడ్ల పరిస్థితి బాగలేకపోవడంతో ఇక్కడికి రావాలంటే అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితికి నేను.. మీరు బాధ్యులం కాదంటూ విద్యార్థులు, సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొన్నింటిని ప్రస్తుత పరిస్థితుల్లో పరిష్కరించలేమని.. ఇదో సవాల్ అని.. దీన్ని భరించాల్సిందేనన్నారు.
ఇప్పటికే చాలా మందికి ఇక్కడే హాస్టల్ వసతి కల్పించామని.. మిగిలిన వారికి కూడా హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. అప్పుడు ఇంటికి వెళ్లి రావాల్సిన అవసరం ఉండదన్నారు. రోడ్ల పరిస్థితిపై వర్సిటీ చేయగలిగింది ఏమీ లేదని.. ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తులు చేశామన్నారు.