శ్రీవారి ధర్మ రథం చోరీ..
చివరకు నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద ఆ బస్సుని స్వాధీనం చేసుకున్నారు. దొంగ మాత్రం పరారయ్యాడు.
తిరుమలలో శ్రీవారి ధర్మరథం (భక్తుల ఉచిత బస్సు) చోరీకి గురికావడంతో కలకలం రేగింది. ఏదయినా వస్తువు పోతేనే పెద్ద హడావిడి జరుగుతుంది, అలాంటిది ఏకంగా బస్సు మాయం కావడంతో అధికారులు కంగారు పడ్డారు. అధునాతన టెక్నాలజీ ఉన్న జీపీఎస్ బస్సు కావడంతో దాని లొకేషన్ కనిపెట్టారు. ఆ బస్సుని స్వాధీనం చేసుకోడానికి బయలుదేరారు. చివరకు నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద ఆ బస్సుని స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల తెలంగాణలో కూడా ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది, ప్రయాణికులతో ఉన్న బస్సుని తీసుకెళ్లి ఓచోట వదిలిపెట్టి పరారయ్యాడు ఆగంతకుడు. చివరకు ప్యాసింజర్లు తేరుకుని అధికారులకు ఫోన్ చేసి అసలు డ్రైవర్ ని పిలిపించారు. అయితే ఇప్పుడు తిరుమలలో బస్సు మాయం కావడంతో అధికారులు కలవరపడ్డారు. తిరుమల కొండపై భక్తుల సేవకు వినియోగించే ఉచిత బస్సులను శ్రీవారి ధర్మ రథాలుగా పిలుస్తారు. ఇలాంటివి మొత్తం 10 ఎలక్ట్రిక్ బస్సులు కొండపై ఉన్నాయి. ఒక్కో బస్సు ఖరీదు 2 కోట్ల రూపాయలు. సబ్సిడీతో టీటీడీ కేవలం 40లక్షల రూపాయలకే ఈ బస్సుల్ని కొనుగోలు చేసింది. కొండపై భక్తులకోసం వీటిని వినియోగిస్తున్నారు. తిరుమలలోని టీటీడీ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం నుంచి ఈ తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ఈ ధర్మరథాన్ని చోరీ చేశాడు.
తిరుమల నుంచి ఆ బస్సు తిరుపతికి వచ్చింది. అక్కడినుంచి నాయుడుపేట మీదుగా నెల్లూరు రూట్ లో వస్తున్నట్టు జీపీఎస్ ద్వారా తెలిసింది. ఉదయం గ్యారేజీలో బస్సు లేకపోవడాన్ని గుర్తించిన సిబ్బంది.. తిరుమల క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీపీఎస్ ద్వారా ఆ బస్సు నెల్లూరు రూట్ లో ఉన్నట్టు గుర్తించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాల బయలుదేరాయి. నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద బస్సు వారికి దొరికింది. దొంగ మాత్రం పరారయ్యాడు. ఈ ఘటనతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని విమర్శలు వినిపిస్తున్నాయి.