14 మంది అత్యుత్తమ క్రీడాకారులకు సూపర్ స్పాన్సర్స్.. ఆడుదాం ఆంధ్రాతో అందిన వరం
ఈ 14 మంది క్రీడాకారులను ఈ సంస్థలు మరింత శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేస్తాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడుగా ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు.
ఆడుదాం ఆంధ్రా పేరుతో గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ ఇలా అన్ని క్రీడల్లోనూ విజేత జట్లకు రూ.5 లక్షల నగదు, ట్రోఫీని సీఎం జగన్ అందజేశారు. అంతకంటే మంచి విషయం ఏమిటంటే.. ఈ పోటీల్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా గుర్తించిన 14 మందికి అద్భుతమైన స్పాన్సర్లు లభించడం.
టాలెంటెడ్ ప్లేయర్స్ దత్తత
కబడ్డీ నుంచి సతీష్, బాలకృష్ణారెడ్డి, సుమన్ అనే ముగ్గురు ఆటగాళ్లను ప్రో కబడ్డీ టీమ్, సుమన్, సంధ్య అనే ఇద్దరు అమ్మాయిలను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాయని సీఎం జగన్ ప్రకటించారు. అలాగే క్రికెట్ నుంచి పవన్, కేవీఎం విష్ణువర్ధన్‌లను ఐపీఎల్ స్టార్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, శివ, కుమారి గాయత్రీలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోబోతున్నాయి. వాలీబాల్ క్రీడాకారులు ఎం. సత్యం, మౌనికలను బ్లాక్ హాంక్స్ సంస్థ ఎడాప్ట్ చేసుకుని శిక్షణ ఇస్తామని ముందుకొచ్చింది. ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఇద్దరు ఖోఖో ఆటగాళ్లను ఏపీ ఖోఖో అసోసియేషన్ దత్తత తీసుకుంటాయి.
స్పాన్సర్ల అండ.. ప్రభుత్వం సపోర్ట్
ఈ 14 మంది క్రీడాకారులను ఈ సంస్థలు మరింత శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేస్తాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడుగా ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు. రెండు నెలలపాటు సాగిన ఈ క్రీడా సంబరాల్లో 25 లక్షల మంది పాల్గొనడం ఒక రికార్డయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా క్రీడలు నిర్వహించి, అందులో అత్యంత ప్రతిభావంతులను జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దేందుకు స్పాన్సర్లను ఒప్పించడం మరో చరిత్ర.