ఏపీని ముందే తాకిన నైరుతి.. ఇద్దరు రైతుల మృతి
అనంతపురం, కడప, సత్యసాయి జిల్లాల్లోని పలు మండలాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. అనంతపురం మండలంలోని ఉరవకొండ, విడపనకలు, వజ్రకరూరు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
నైరుతి రుతుపవనాలు ఏపీని అనుకున్న సమయం కంటే ముందే తాకాయి. ఈనెల 4, 5 తేదీల్లో నైరుతి రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా.. ముందే ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
అనంతపురం, కడప, సత్యసాయి జిల్లాల్లోని పలు మండలాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. అనంతపురం మండలంలోని ఉరవకొండ, విడపనకలు, వజ్రకరూరు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటి కారణంగా పలుచోట్ల వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సత్యసాయి జిల్లాలో పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది.
పల్నాడు జిల్లాలో గాలి వానతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగులు పడి ఇద్దరు రైతులు మృతి చెందారు. జిల్లాలోని యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో వీరయ్య, శ్రీనివాసరావు అనే ఇద్దరు రైతులు పొలంలో పనిచేస్తుండగా పిడుగులు పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.