Telugu Global
Andhra Pradesh

త్వరలోనే రెడ్‌బుక్‌ మూడో చాప్టర్‌ ఓపెన్‌

అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యలు

త్వరలోనే రెడ్‌బుక్‌ మూడో చాప్టర్‌ ఓపెన్‌
X

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ మరో బాంబ్‌ పేల్చారు. పాలనను గాలికి వదిలేసి రెడ్‌ బుక్‌ పేరుతో విపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తున్నది. ఈ క్రమంలోనే రెడ్‌ బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్‌ అయ్యాయని లోకేశ్‌ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపెడుతాం. డౌట్‌ లేదు. త్వరలోనే రెడ్‌బుక్‌ మూడో చాప్టర్‌ కూడా తెరుస్తామన్నారు. యువగళం పాదయాత్రలో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రెడ్‌ బుక్‌కు భయపడుతున్న జగన్‌.. గుడ్‌ బుక్‌ తెస్తానంటున్నారు. బుక్‌లో ఏమి రాయాలో ఆయనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే కేసులు పెట్టి లుకౌట్‌ నోటీసులు ఇచ్చేవారు. కానీ నోటీసులకు భయపడకుండా ఎన్‌ఆర్‌ఐలు నిలబడినారు.

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా తీసుకెళ్లాలి. సంక్షేమం అంటే ఏమిటో ఎన్టీఆర్‌ చూపెట్టారు. ప్రపంచంలో తెలుగువారంతా తలెత్తుకొని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుంటామన్నారు. మీరు ఎన్‌ఆర్‌ఐలు కాదు.. ఎంఆర్‌ఐలు అని పిలుస్తానన్నారు. అంటే 'మోస్ట్‌ రిలయబుల్‌ ఇండియన్స్‌' అని అర్థం. ఏపీలో కూటమి గెలుపు ప్రపంచంలోని ప్రతి ఒక్క తెలుగువారిదని లోకేశ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేత కోమటి జయరాం పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ సమయంలో అభిమానులు హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం కురింపించారు.

First Published:  1 Nov 2024 9:00 AM IST
Next Story