Telugu Global
Andhra Pradesh

అత్త‌ను న‌రికి చంపిన అల్లుడు.. - విజ‌య‌వాడ‌లో న‌డిరోడ్డుపై దారుణం

తన భార్యను కాపురానికి పంపకుండా విడాకుల కోసం కోర్టులో కేసు వేశారనే అక్కసుతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

అత్త‌ను న‌రికి చంపిన అల్లుడు.. - విజ‌య‌వాడ‌లో న‌డిరోడ్డుపై దారుణం
X

విజ‌య‌వాడ‌లో న‌డిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది. అత్త‌ను అల్లుడే అతి కిరాత‌కంగా న‌రికి చంపేశాడు. మామ‌ను కూడా చంపేందుకు ప్ర‌య‌త్నించ‌గా, ఆయ‌న అక్క‌డి నుంచి ప‌రారై ప్రాణాలు కాపాడుకున్నాడు. విజయవాడ చిట్టినగర్ సమీపంలో పాల ఫ్యాక్టరీకి ఆనుకొని ఉన్న చనమోలు వెంకట్రావు వంతెనపై శనివారం రాత్రి 8.30 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

త‌న కాపురానికి అడ్డు ప‌డుతున్నార‌ని..

తన భార్యను కాపురానికి పంపకుండా విడాకుల కోసం కోర్టులో కేసు వేశారనే అక్కసుతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. వైఎస్ఆర్ కాలనీ బ్లాక్ నంబరు 68లో గోగుల గురుస్వామి, నాగమణి (50) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఝూన్సీ, లలిత, మణి ముగ్గురు సంతానం. రెండో కుమార్తె లలితకు, ఏకలవ్య నగర్‌కు చెందిన కుంభా రాజేష్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం రాజేష్ ఫుడ్ కోర్టులోని బిర్యానీ పాయింట్‌లో పని చేస్తున్నాడు.

విడాకుల కోసం కోర్టును ఆశ్ర‌యించిన భార్య‌..

భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకోవడంతో పోలీస్ స్టేషన్‌లో కేసులు నడిచాయి. ఏడాది కిందట విడాకులు కావాలని లలిత కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. 15 రోజుల కిందట వాయిదాకు వెళ్లారు. మళ్లీ వచ్చే వాయిదాకి విడాకులు ఇచ్చే అవకాశం ఉండటంతో అత్త, మామ కాపురానికి పంపకుండా తన భార్యను సమర్థిస్తున్నారనే అక్కసుతో అల్లుడు రాజేష్ వారిపై కక్ష పెంచుకున్నాడు. తన కాపురానికి అత్త అడ్డుపడుతోందని భావించి ఈ హత్యకు పథక రచన చేశాడు.

రెక్కీ వేసి.. ప‌క్కా ప్లాన్‌తో..

గురుస్వామి, నాగమణి సాయిరాం థియేటర్ వద్ద ఉన్న తన పెద్ద కుమార్తె ఝూన్సీ వద్దకు వెళ్లేందుకు శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కాలనీ నుంచి బయలు దేరారు. అప్పటికే రెక్కీ నిర్వహించిన అల్లుడు రాజేష్.. అత్తమామలు వెళ్లడాన్ని గమనించి వెంబడించాడు. వారు చనమోలు వెంకట్రావు వంతెనపై నుంచి వస్తుండగా సరిగ్గా వంతెన పైభాగంలో పాల ఫ్యాక్టరీ మలుపు తిరిగే వద్ద నిదానంగా వెళ్లడాన్ని పరిశీలించాడు. ఇదే అదనుగా భావించి తనతో తెచ్చుకున్న కొబ్బరిబొండాల కత్తితో.. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున అత్త నాగమణి చేతిపై నరికాడు. దీంతో ఒక్కసారిగా అరుస్తూ ఆమె వాహనంపై నుంచి కింద పడింది. వెంటనే ఆమె మెడపై నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

మామ‌నూ చంపాల‌ని వెంబ‌డించినా..

ఈ ఘటనతో మామ గురుస్వామి అక్కడ నుంచి భయంతో పారిపోయాడు. మామను కూడా హత మార్చాలని అల్లుడు వెంబడించినా అతను దొరకలేదు. అనంతరం రాజేష్ తన వాహనంతో పరార‌య్యాడు. కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వ‌ర్యంలో పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  25 Jun 2023 10:34 AM IST
Next Story