వీర్రాజుకి ఇంకా అర్థం కాలేదా..? ఇంతకంటే క్లియర్ గా చెప్పాలా..?
జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. పొత్తులపై తేల్చేశారు కదా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు వీర్రాజు బదులిచ్చారు.
“బీజేపీతో మనకు వర్కవుట్ కాలేదు, కలసి కార్యక్రమాలు చేద్దామన్నా వారు సహకరించడంలేదు, తెలంగాణలో పోటీ చేస్తానంటే నువ్వు నాన్ లోకల్ అంటూ నన్ను అవమానించారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు.” జనసేన 10వ ఆవిర్భావ సభలో వపన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలు వింటే ఎవరికైనా ఏమనిపిస్తుంది. మాకింక మీ పొత్తు వద్దు బాబోయ్ అంటూ పవన్ కల్యాణ్ మొత్తుకున్నట్టు తేటతెల్లమవుతుంది. మరి ఈ విషయం సోము వీర్రాజుకి ఎందుకు అర్థం కాలేదో తెలియడంలేదు.
పవన్ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే..?
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. పొత్తులపై పవన్ తేల్చేశారు కదా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు వీర్రాజు బదులిచ్చారు. జనసేన, తెలుగుదేశం పొత్తుపై పవన్ ఎక్కడా మాట్లాడలేదని అన్నారు వీర్రాజు. పవన్ బీజేపీతో పొత్తుపైనే మాట్లాడారని చెప్పారు. టీడీపీతో కూటమి కడతామంటూ జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చిన తర్వాత.. తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు వీర్రాజు.
వీర్రాజు చేతిలో ఏముంది..?
ఏపీ బీజేపీకి వీర్రాజు అధ్యక్షుడే అయినా జనసేన విషయంలో నిర్ణయం తీసుకునేంత సీన్ ఆయనకు లేదనే విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా.. అవన్నీ అధిష్టానానికి చేరవేసి, వారి నిర్ణయం ప్రకారమే వీర్రాజు నడుచుకోవాలి. అందుకే ఆయన పవన్ మాట్లాడిన మాటలకు అర్థం తెలియనట్టే వివరణ ఇచ్చారు. టీడీపీ పొత్తుపై పవన్ మాట్లాడితే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. ఇప్పటికే చాలాసార్లు పవన్ కల్యాణ్.. బీజేపీ పొత్తు విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇటీవల రెండు పార్టీలు ఎక్కడా కలసి పనిచేయలేదు, కలసి నిరసనల్లో కూడా పాల్గొనలేదు. అలాంటిది ఇంకా పొత్తులోనే ఉన్నామంటూ బీజేపీ చెప్పుకుంటోంది, జనసేన మాత్రం టీడీపీ వైపు చూస్తోంది. రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉన్నా జనసేన పొత్తు విషయంలో వీర్రాజు మాత్రం పవన్ కల్యాణ్ నుంచి ఇంకా ఏదో పెద్ద స్టేట్ మెంట్ ఆశిస్తున్నట్టున్నారు.