Telugu Global
Andhra Pradesh

మా కాపురం ఎలా ఉందంటే..? జనసేనపై వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

సలహాదారులకి సకాలంలో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం, ఉద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సలహాదారుల జీతాలు, వాళ్ళ విధుల మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మా కాపురం ఎలా ఉందంటే..? జనసేనపై వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
X

ఏపీలో జనసేన ప్రస్తుతం ఎవరితో పొత్తులో ఉంది, ఎన్నికలనాటికి ఏ పార్టీతో కలసి వెళ్తుంది. దీనిపై ఇంకా క్లారీటీ లేదు. జనసేన నేతలు బీజేపీని పూర్తిగా లైట్ తీసుకున్నా.. కాషాయదళం మాత్రం జనసైనికుల్ని వదిలిపెట్టేలా లేదు. తమ కాపురం ఇంకా సజావుగానే సాగుతోందని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జనసేనతో బీజేపీ కాపురం బాగుందని, జనసేన శ్రేణులు తమకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు వారాహి వాహన ప్రారంభోత్సవంలో బీజేపీతోనే కలిసి ఉంటామని పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తు చేశారు సోము వీర్రాజు.

సలహాదారులకంటే ఉద్యోగులు తీసిపోయారా..?

ఉద్యోగుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు సోము వీర్రాజు. దివాళా తీసిన ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల మాదిరిగా, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తయారైందని విమర్శించారు. సలహాదారులకి సకాలంలో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం, ఉద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సలహాదారుల జీతాలు, వాళ్ళ విధుల మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను దొంగ దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, హామీలు నెరవేర్చడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు.

ఎన్నికలకోసం కపట ప్రేమ..

సీపీఎస్ రద్దు విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టి, బకాయిలను అటకెక్కించిన ప్రభుత్వం ఇటీవల బకాయిలపై డెడ్ లైన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు సోము వీర్రాజు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఉద్యోగులపై కపట ప్రేమ చూపిస్తోందన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందన్న ఆయన, ధైర్యంతో పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు కూడా రాజకీయ నేతల్లాగా రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. జీతాలు వస్తే.. అదే మహాభాగ్యం అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం తయారు చేసిందని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు, వ్యతిరేక ఓటును.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సానుకూలంగా మలచుకుంటుందన్నారు వీర్రాజు.

First Published:  9 March 2023 3:21 PM IST
Next Story