Telugu Global
Andhra Pradesh

టీడీపీతో బేరం కుదర్లేదా..? వీర్రాజు వ్యాఖ్యల మర్మమేంటి..?

అమిత్‌ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన మీకు మీరే అన్నీ ఊహించేసుకుంటారా అని ప్రశ్నించారు సోము వీర్రాజు. అమిత్‌ షాతో భేటీ తర్వాత దానిపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు కదా అని లాజిక్ తీశారు.

టీడీపీతో బేరం కుదర్లేదా..? వీర్రాజు వ్యాఖ్యల మర్మమేంటి..?
X

ఇటీవల చంద్రబాబు, అమిత్ షా ఢిల్లీలో కలిశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు విషయంపై చర్చించేందుకే ఈ భేటీ జరిగిందనేది బహిరంగ రహస్యం. మరి కనీసం ఇద్దరిలో ఒకరైనా ఈ భేటీ గురించి ఆ తర్వాత ఎందుకు మాట్లాడలేదు..? టీడీపీ, బీజేపీ నుంచి కూడా అధికారిక ప్రకటన ఎందుకు రాలేదు..? బేరం కుదర్లేదా..? ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు ఈ అనుమానానికి బలం చేకూరుస్తున్నాయి. ఏబీలో డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమంటున్న వీర్రాజు, అసలు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని ఎవరు చెప్పారని మీడియాని ఎదురు ప్రశ్నించారు.

అలా కలిస్తే ఇలా ఊహించేసుకుంటారా..?

అమిత్‌ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన మీకు మీరే అన్నీ ఊహించేసుకుంటారా అని ప్రశ్నించారు సోము వీర్రాజు. అమిత్‌ షాతో భేటీ తర్వాత దానిపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు కదా అని లాజిక్ తీశారు వీర్రాజు. రాష్ట్రానికి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కావాలనేది తన ఆకాంక్ష అన్నారు. మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమం అందరికీ కనిపిస్తోందని, వైసీపీ ఏం చేసిందో ప్రజలకు కూడా తెలుసన్నారు వీర్రాజు. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారాయన.

పొత్తు ఉన్నట్టా..? లేనట్టా..?

ఏపీలో బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయమనే వార్తలు వినిపించినా ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరోవైపు జనసేన కూడా పొత్తుల విషయంలో తేల్చి చెప్పడంలేదు. ఆ రెండు పార్టీలు అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి టీడీపీ ఒప్పుకుంటుందో లేదో తెలియదు. ఆలస్యమయ్యే కొద్దీ టీడీపీపై ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు. నాన్చి నాన్చి, చివరకు సీట్లు విదిలిస్తే వాటిని తీసుకోడానికి బీజేపీ, జనసేన సిద్ధంగా ఉంటాయనుకోలేం. అందుకే అప్పుడప్పుడూ ఇలా జర్క్ లివ్వడానికి వీర్రాజు లాంటి వారిని టీడీపీ అధిష్టానం తెరపైకి తెస్తున్నట్టుంది.

First Published:  24 Jun 2023 4:19 PM IST
Next Story