సోము వీర్రాజు ఫేస్ బుక్ హ్యాక్.. హేళన చేసేలా పోస్టింగ్‌లు
వ్యక్తిగతంగా సోము వీర్రాజుని అవహేళనకు గురిచేసేలా కొన్ని పోస్టింగ్‌లు ఉన్నాయని సమాచారం. అయితే కాస్త ఆలస్యంగా తేరుకున్న సోము వీర్రాజు వెంటనే ప్రొఫైల్ లాక్ చేశారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫేస్ బుక్ అకౌంట్‌ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అక్కడితో ఆగలేదు, ఆయన అకౌంట్ నుంచి పలు అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టారు. ఈ విషయం ఆలస్యంగా గుర్తించింది బీజేపీ టీమ్, ఈలోగా ఆ పోస్టింగ్‌లు కలకలం రేపాయి. వ్యక్తిగతంగా సోము వీర్రాజుని అవహేళనకు గురిచేసేలా కొన్ని పోస్టింగ్‌లు ఉన్నాయని సమాచారం. అయితే కాస్త ఆలస్యంగా తేరుకున్న సోము వీర్రాజు వెంటనే ప్రొఫైల్ లాక్ చేశారు. పోస్టింగ్‌లు ఎవరికీ కనపడకుండా చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోదీ విశాఖ పర్యటనకు ముందుగా..
ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రెండు రోజుల ముందుగా సోము వీర్రాజు అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయం ఆయన కూడా గమనించలేదు. ఆ తర్వాత ఆయనకు సంబంధం లేని పోస్టింగ్‌లు, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే పోస్టింగ్‌లు రావడంతో ఆయన షాకయ్యారు. ఆయన ఫాలోవర్లకు కూడా విషయం అర్థం కాలేదు. దీంతో వెంటనే సోము వీర్రాజు పర్సనల్ అకౌంట్‌ని లాక్ చేసుకున్నారు. ప్రస్తుతం సోము వీర్రాజు ఫేస్ బుక్ పేజీ ఎవరికీ కనపడటం లేదు, అందులోని వీడియోలు, ఫొటోలు కూడా ఎవరికీ కనిపించడం లేదు.
ఎవరి పని..?
వ్యక్తిగతంగా ఆయనపై పోస్టింగ్‌లు పెట్టారంటే, అది రాజకీయ ప్రతీకారం కోసం చేసినపనే అనుకుంటున్నారు సోము వీర్రాజు. ఈమేరకు ఆయన టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. సోము వీర్రాజు ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయిందని, ఆయన ఫేస్ బుక్ ఖాతా నుంచి మెసేజ్‌లు వచ్చినా ఎవరూ స్పందించవద్దని చెప్పారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కార్యాలయ సిబ్బంది తరపున ఫిర్యాదు చేశారు. హ్యాకర్స్ ఎవరో కనిపెట్టాలని కోరారు.