జగన్ దృష్టి పెట్టకపోతే ఈ నియోజకవర్గాలు కష్టమేనా ?
వైసీపీలోనే అంతర్గత కుమ్ములాటల కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేతల మధ్య వివాదాలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే.
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వెంటనే జోక్యం చేసుకుని నియోజకవర్గాల్లోని నేతల మధ్య వివాదాలను పరిష్కరించకపోతే చేతులారా ఆ నియోజకవర్గాలను పోగొట్టుకున్నట్లవుతుంది. ఇలాంటి నియోజకవర్గాలు సుమారు ఒక ఎనిమిదున్నాయి. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, కడప, కృష్ణా, తూర్పుగోదావరి, వైజాగ్ జిల్లాల్లో ఒక్కోటున్నాయి.
వీటిల్లో కూడా బాగా సమస్యాత్మకంగా ఉన్నవి చిత్తూరులోని నగిరి, కృష్ణాజిల్లాలోని గన్నవరం, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కడపలోని ప్రొద్దుటూరు, అనంతపురం జిల్లాలోని హిందుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో గమనించాల్సిందేమంటే ప్రత్యర్థి పార్టీల నుండి సమస్యలు రావటం లేదు. వైసీపీలోనే అంతర్గత కుమ్ములాటల కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేతల మధ్య వివాదాలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే.
నగిరిలో రోజాకు బలమైన ప్రత్యర్థి వర్గం తయారైంది. ఈ వర్గం మంత్రిని ప్రతిరోజు ముప్పుతిప్పలు పెడుతోంది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ కూడా అంతర్గత కుమ్ములాటలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అంతర్గత వివాదాలు బాగా పెరిగిపోయాయని సమాచారం. ఇక ప్రకాశంలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై పార్టీలోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కు పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.
ఇక అనంతపురం జిల్లాలోని హిందుపురం నియోజకవర్గం కంపుగా తయారైంది. దీనికి ప్రధాన కారణం జగనే. రెండు మూడు గ్రూపులను జగనే ప్రోత్సహించినట్లయ్యింది. గ్రూపుల గోల పెరిగిపోవటంతో పాటు ఈమధ్యనే రామకృష్ణారెడ్డి హత్యతో పార్టీ గ్రాఫ్ పడిపోయింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నుండి గెలిచారు. అయితే ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. వంశీకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయం చేయటంతో నియోజకవర్గంలోని రెండు బలమైన గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి.
చివరగా వైజాగ్ జిల్లాలో అనకాపల్లిలో కూడా గ్రూపుల గోల బాగానే ఉంది. మంత్రి అమర్‌నాథ్‌కు వ్యతిరేకంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వర్గం మండుతోంది. జగన్ వెంటనే దృష్టి పెట్టి నేతల మధ్య వివాదాలను పరిష్కరించకపోతే పై నియోజకవర్గాల్లో గెలుపు కష్టమనే అనుకోవాలి. అంటే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య మామూలుగా జనాల్లో ఉండే అసంతృప్తికి పై నియోజకవర్గాలు బోనస్‌గా తయారవుతాయనటంలో సందేహం లేదు.