Telugu Global
Andhra Pradesh

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హ‌త్య‌.. - కారులోనే స‌జీవ‌ద‌హ‌నం

మృతుడు నాగ‌రాజు బెంగళూరులోని ఓ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌ను వ‌ర్క్ ఫ్రం హోమ్‌లో భాగంగా తిరుప‌తిలో ఉండి ప‌నిచేస్తున్న‌ట్టు తెలిసింది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హ‌త్య‌.. - కారులోనే స‌జీవ‌ద‌హ‌నం
X

ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కారులోనే స‌జీవ‌ద‌హ‌న‌మైన సంఘ‌ట‌న తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి మండ‌లంలో శ‌నివారం అర్ధ‌రాత్రి చోటుచేసుకుంది. నాయుడుపేట - పూత‌ల‌ప‌ట్టు రోడ్డులో గంగుడుప‌ల్లె వ‌ద్ద జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు అందించిన స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కారులో పూర్తిగా ద‌గ్ధ‌మై గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో మృత‌దేహం ఉంది. కారు నంబ‌ర్ ఆధారంగా మృతుడు నాగ‌రాజుగా.. అత‌ని స్వ‌స్థలం వెదురుకుప్పం మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మృతుడు నాగ‌రాజు బెంగళూరులోని ఓ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌ను వ‌ర్క్ ఫ్రం హోమ్‌లో భాగంగా తిరుప‌తిలో ఉండి ప‌నిచేస్తున్న‌ట్టు తెలిసింది. శ‌నివారం అత‌ను కారులో బ్రాహ్మ‌ణ‌ప‌ల్లికి వెళ్తుండ‌గా, అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత మార్గమ‌ధ్య‌లో దుండ‌గులు కారును అడ్డ‌గించారు. అనంత‌రం కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘ‌ట‌న‌లో నాగ‌రాజు కారులోనే స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యాడు.

మృతుడు నాగ‌రాజుకు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. స‌మాచారం అందుకుని ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న కుటుంబ స‌భ్యులు నాగ‌రాజు మృత‌దేహాన్ని చూసి క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

హ‌త్య‌కు కార‌ణాలు ఇవేనా?

గ్రామ‌స్తుల నుంచి పోలీసులు సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం.. మృతుడి స్వ‌స్థలం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిలో అత‌ని త‌మ్ముడు పురుషోత్తంకు గ్రామానికి చెందిన వేరొక మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్టు తెలిసింది. ఈ వివాదంపై చ‌ర్చించేందుకు పురుషోత్తంను తీసుకుని రావాల‌ని నాగ‌రాజును సంబంధిత మ‌హిళ కుటుంబ స‌భ్యులు కోరిన‌ట్టు తెలిసింది. అయితే త‌న త‌మ్ముడిని తీసుకెళ్ల‌కుండా నాగ‌రాజు ఒక్క‌డే బ‌య‌లుదేరి వెళ్లిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అత‌న్ని హ‌త‌మార్చిన దుండ‌గులు.. అత‌న్ని కారులోనే ఉంచి.. ద‌గ్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. అనంత‌రం కారును లోయ‌లోకి తోసేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు ఘ‌ట‌నాస్థ‌లంలో ప‌రిస్థితిని చూస్తే అర్థ‌మ‌వుతోంది.

First Published:  2 April 2023 11:48 AM IST
Next Story