Telugu Global
Andhra Pradesh

వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

చెన్నైలోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న మోహన్‌ తరచూ తిరుపతిలోని అన్న వద్దకు వచ్చి వెళుతుండేవాడు. అదే విధంగా రెండు రోజుల క్రితం తిరుపతికి వచ్చిన మోహన్‌.. బుధవారం సాయంత్రం అన్న కుమార్తెలు దేవశ్రీ (13), నీరజ (10)లను స్కూల్‌ నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద దింపి బయటికి వెళ్లాడు.

వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం
X

తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న కుటుంబంపై కక్ష పెంచుకున్న తమ్ముడు వదినను, ఇద్దరు పిల్లలను పీక కోసి హతమార్చాడు. ఆపై అతనూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి పద్మావతి నగర్‌కు చెందిన టీపీ దాస్‌ ప్రైవేటు ఉద్యోగి. ఆయన తమ్ముడు మోహన్‌ (36) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. 2019లో అతనికి వివాహం చేశారు. పలు వివాదాల కారణంగా అతని భార్య 2021లో అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆ తర్వాత తమ్ముడి భార్యతోను, ఆమె పుట్టింటివారితోను మాట్లాడిన దాస్‌.. వారిద్దరూ కలిసి ఉండేలా ఒప్పించాడు. ఆ సమయంలోనే తనకు ఇష్టం లేని పెళ్లి చేశావంటూ మోహన్‌ తన అన్న దాస్‌పై దాడికి పాల్పడ్డాడు. ఇదిలావుంటే దంపతులిద్దరి మధ్య మళ్లీ వివాదాలు రావడంతో మోహన్‌ భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మోహన్‌ మానసికంగా కృంగిపోయాడు. చెన్నైలోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న మోహన్‌ తరచూ తిరుపతిలోని అన్న వద్దకు వచ్చి వెళుతుండేవాడు. అదే విధంగా రెండు రోజుల క్రితం తిరుపతికి వచ్చిన మోహన్‌.. బుధవారం సాయంత్రం అన్న కుమార్తెలు దేవశ్రీ (13), నీరజ (10)లను స్కూల్‌ నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద దింపి బయటికి వెళ్లాడు.

ఆ తర్వాత అన్న లేని సమయంలో ఇంటికి వచ్చిన మోహన్‌.. కత్తితో అన్న కుమార్తెలిద్దరినీ, వదిన సునీత (40)ను విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన దాసు లోపలి నుంచి తలుపు గడి పెట్టి ఉండటంతో వెనుక నుంచి తలుపు తీసుకొని లోపలికి వెళ్లాడు. ఇంట్లో భార్యాపిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటం, మోహన్‌ లోపలి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. అతని సమాచారం మేరకు ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ కులశేఖర్‌ ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దాసును కూడా విచారిస్తున్నామన్నారు.

First Published:  25 July 2024 6:45 AM
Next Story