కరెంటు తీగలు తెగిపడి పొలంలో ఆరుగురు కూలీల దుర్మరణం..
విద్యుత్ వైర్లు తెగిపడే సమయానికి అక్కడే ఉన్న రైతు కూలీలు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. ఎవరూ ఎవరినీ కాపాడలేని పరిస్థితి. అందరూ కరెంట్ షాక్‌కి గురయ్యారు. అందులో ఆరుగురు బలయ్యారు.
ఏపీలో కరెంటు తీగలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల వరుసగా జరిగిన మూడు ఘటనల్లో రైతులు, రైతు కూలీలే ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరం. తాజాగా అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు పొలంలోనే మరణించారు. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరుకి చెందిన కూలీలు ఆముదం పంట కోయడానికి ట్రాక్టర్‌లో పొలానికి వెళ్లారు. పంట కోస్తున్న సమయంలో వర్షం పడుతోంది. కూలీలంతా ఇంటికి తిరిగి వెళ్దామని బయలుదేరే సమయానికి విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వరుస ప్రమాదాలు..
ఏపీలో ఇటీవల కరెంటు తీగలు తెగిపడిన ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం సత్యసాయి జిల్లాలో ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడటం వల్ల రైతు కూలీలు ఎనిమిది మంది సజీవదహనం అయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఉడతలు హైటెన్షన్ వైర్లను కొరకడమే ఆ ఘటనకు ప్రధాన కారణం అంటూ అధికారులు వివరణ ఇవ్వడం మరింత సంచలనం అయింది. ఆ తర్వాత కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడులో పొలానికి వెళ్లిన ముగ్గురు రైతులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మోటర్ వద్ద కరెంటు షాక్‌తో ముగ్గురు రైతులు చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజా ఘటనతో మరోసారి కరెంటు ప్రమాదాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి.
దర్గాహొన్నూరు గ్రామంలో విషాద ఛాయలు..
ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు రైతు కూలీలు కరెంటు తీగలు తెగిపడి పొలంలోనే ప్రాణాలు వదలడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా దర్గాహొన్నూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యుత్ వైర్లు తెగిపడే సమయానికి అక్కడే ఉన్న రైతు కూలీలు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ కాపాడలేని పరిస్థితి. అందరూ కరెంట్ షాక్‌కి గురయ్యారు. అందులో ఆరుగురు బలయ్యారు. ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరుస ఘటనలతో ఏపీలో కరెంటు షాక్ ప్రమాదాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై విచారణ జరుపుతోంది.