ప్రాథమిక విచారణ పూర్తి.. నేడే సిట్ నివేదిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ అధికారుల విచారణ పూర్తయింది. చంద్రగిరి హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ మూడో రోజు కొనసాగుతోంది.
ఏపీలో ఎన్నికల అల్లర్లపై విచారణకోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తమ ప్రాథమిక రిపోర్ట్ రెడీ చేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన అల్లర్లపై సిట్ విచారణ చేపట్టింది. పలు దఫాలు అక్కడ సమాచారాన్ని సేకరించింది. వీడియో ఫుటేజీలు తీసుకుని విశ్లేషించింది. పోలీసుల వద్దనుంచి కూడా సమాచారం సేకరించి ప్రాథమిక రిపోర్ట్ రెడీ చేసింది. ఈరోజు ఈ నివేదికను సిట్, ఏపీ డీజీపీకి అందించే అవకాశముంది. ఏపీ చీఫ్ సెక్రటరీ ద్వారా ఈ రిపోర్ట్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారితోపాటు, కేంద్ర ఎన్నికల సంఘానికి అందుతుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ అధికారుల విచారణ పూర్తయింది. ఎన్నికల అల్లర్లకు సంబంధించి ఆల్రడీ స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వివరాలు తీసుకున్న సిట్ అధికారులు పలు వీడియో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా సిట్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదులను కూడా తమ నివేదికలో సిట్ పొందుపరుస్తుంది.
మరోవైపు.. చంద్రగిరి హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. చంద్రగిరిలో జరిగిన దాడులకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు, కూచువారిపల్లె గ్రామాస్థులు అందించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలించిన సిట్ బృందం.. పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తోంది. నేడు పల్నాడు జిల్లాలోని క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో కూడా సిట్ బృందం పర్యటిస్తుంది. పెదకూరపాడు నియోజకవర్గంలోని దొడ్లేరు, వేల్పూరు గ్రామాల్లో కూడా అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తారు. ఈ వివరాలన్నిటినీ తుది నివేదికలో పొందుపరుస్తారు.