AP:పోలీసులే దొంగలు...పోలీసు స్టేషన్ లో దోపిడి... 75 లక్షల విలువచేసే ఆభరణాలు మాయం
పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.75 లక్షల విలువైన 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2 లక్షల నగదును కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ లో ఓ బీరువాలో దాచిపెట్టారు. అయితే ఆ ఆభరణాలు, నగదు స్వంతదారులైన వ్యాపారులు, సతన భారతి, మణికండం వాటిని తమ స్వాధీనం చేయాలని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని ఈ నెల 27న కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ కు వచ్చారు.
తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు2021 జనవరి 28న కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, 105 కిలోల వెండి ఆభరణాలు, రూ. 2 లక్షల నగదును అక్రమంగా హైదరాబాద్ నుంచి తమిళనాడుకు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యాపారులను గుర్తించారు. పోలీసులు వారిని పట్టుకొని వారి వద్ద ఉన్న వెండిని, నగదును, కారును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.75 లక్షల విలువైన 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2 లక్షల నగదును కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ లో ఓ బీరువాలో దాచిపెట్టారు. అయితే ఆ ఆభరణాలు, నగదు స్వంతదారులైన వ్యాపారులు, సతన భారతి, మణికండం వాటిని తమ స్వాధీనం చేయాలని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని ఈ నెల 27న కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ కు వచ్చారు.
కోర్టు ఆదేశాలను చూసిన సీఐ ఆ ఆభరణాలను నగదును వ్యాపారులకు అప్పగించేందుకు ఆ బీరువాను ఓపెన్ చేసి చూడగా అందులో నగలు, నగదు కనిపించలేదు. షాక్ కు గురైన సీఐ వెంటనే ఎస్పీకి సమాచారం అందించారు.
వెంటనే అప్రమత్తమైన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమగ్ర విచారణకు ఆదేశించి పట్టణ డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు.
రెండేళ్లలో ఈ పోలీసు స్టేషన్ లో నలుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తించి బదిలీలకు గురైనట్లు సమాచారం. ఆ నలుగు సీఐలను కూడా విచారించారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు కనిపించకుండా పోవడంలో సిబ్బంది, కిందిస్థాయి అధికారుల పాత్ర ఉన్నట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
చోరీకి పాల్పడిన నిందితులైన పోలీసు సిబ్బంది, కిందిస్థాయి అధికారులను గుర్తించినట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.
“నిందితులైన సిబ్బందిపై క్రిమినల్ కేసులు బుక్ చేస్తాము. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటాము. వారిని త్వరలోనే జైలుకు పంపుతాం' అని ఎస్పీ కౌశల్ స్పష్టం చేశారు.