జనసేన స్థానాల్లో టికెట్ ఇవ్వండి.. టీడీపీ నేతల బలప్రదర్శన
రాజమహేంద్రవరం రూరల్‌లో సీటు ఆశించిన జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌ను నిడదవోలులో నిలబెట్టేందుకు రంగం సిద్ధమైంది.
సామాజికవర్గ ఓట్లపరంగానో, అభిమానగణంపరంగానో జనసేనకు కాస్త బలమున్నవి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలే. అందుకే ఇక్కడ ఎక్కువ సీట్లు కోరుకుంటోంది ఆ పార్టీ. కానీ, టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కూడా ఆ రెండు జిల్లాలు పెట్టని కోటలు. మధ్యలో వైఎస్, మొన్నటి ఎన్నికల్లో జగన్ ఆ కోటలను బద్దలుకొట్టారు. అయినప్పటికీ మళ్లీ అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో పాగా వేయాల్సిందేనని టీడీపీకి తెలుసు. కానీ, జనసేనతో పొత్తు నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు వారికే కేటాయించారు. దీన్ని టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తున్నాయి.
మొన్న బూరుగుపల్లి బలప్రదర్శన
పొత్తులో భాగంగా నిడదవోలు సీటును జనసేనకు కేటాయిస్తారని బలంగా ప్రచారంలో ఉంది. రాజమహేంద్రవరం రూరల్‌లో సీటు ఆశించిన జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌ను నిడదవోలులో నిలబెట్టేందుకు రంగం సిద్ధమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు వర్గం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తోంది. మన నిడదవోలు మన శేషారావు పేరిట వేలమందితో నిడదవోలులో ర్యాలీ తీశారు. టికెట్ జనసేనకు ఇస్తే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలని నిత్యం టీడీపీ శ్రేణులు శేషారావు ఇంటి ముందు చేరి నినాదాలు చేస్తున్నారు.
నిన్న గన్ని కార్ల ర్యాలీ
మరోవైపు ఏలూరు జిల్లా ఉంగుటూరు సీటును జనసేనకు కేటాయించడం ఖాయమైపోయింది. ఏదైనా సమీకరణాలు మారితే దాన్ని బీజేపీకి ఇస్తారేమో కానీ, టీడీపీకి ఇచ్చే ఛాన్స్ లేదు. అయినా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వర్గం టికెట్ తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడైన గన్నికే టికెట్ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తోంది. ఇరవై ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న గన్నికే టికెట్ ఇవ్వాలంటూ ఏకంగా 700 కార్లతో నియోజకవర్గం నుంచి అమరావతిలోని పార్టీకార్యాలయం వరకు బలప్రదర్శన చేశారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా ఇలా జనసేనకు సీటిస్తామన్న ప్రతిచోటా టీడీపీ నుంచి నిరసన ధ్వనులు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ లెక్కన పొత్తులో ఎంత వరకు సహకరించుకుంటారనేది అనుమానంగా మారుతోంది.