Telugu Global
Andhra Pradesh

బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా పెరగకూడదా బాబూ ?

సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని అంటే ప్రజలందరికి చెందుతుందని.. అమరావతి మాత్రం అలా కాదని చంద్రబాబు, ఎల్లో మీడియా వాదిస్తోందని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని

బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా పెరగకూడదా బాబూ ?
X

సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని అంటే ప్రజలందరికి చెందుతుందని.. అమరావతి మాత్రం అలా కాదని చంద్రబాబు, ఎల్లో మీడియా వాదిస్తోందని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో భూములు ఇతరులకు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. తనకు కావాల్సిన వ్యక్తి భూములు గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఉంటే.. ఆ భూములను తీసుకుని అమరావతిలో భూములు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. కానీ పేదలకు మాత్రం అమరావతిలో స్థలాలు ఇవ్వకూడదని.. ఇస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా పెరిగిపోతుందని నిసిగ్గుగా చంద్రబాబు, ఆయన మీడియా వాదిస్తోందన్నారు.

చంద్రబాబు అమరావతిలో భూములను ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చినా ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమ్మగా ఉంటుందని.. అదే రాష్ట్రానికి చెందిన పేదలకు ఇస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారన్నారు. అసలు ప్రజలకు స్థలాలు ఇవ్వకుండా అమరావతిలో ఏం చేయాలనుకున్నారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలోకి బీసీఎస్సీఎస్టీలు రాకూడదు, మనం, మనవాళ్లే ఉండాలన్నట్టు కంచెం వేసుకున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అమరావతివాదులది త్యాగం అనడం ఏమిటని ప్రశ్నించారు.

ఈనెల 12 నుంచి మరోసారి మహాపాదయాత్ర 2.0 అంటూ జాతరగా బయలుదేరుతున్నారని ఎద్దేవా చేశారు. రోబో 2.0, పుష్పా -2, కార్తీకేయ -2 అన్నట్టుగా అమరావతి వాదుల ఉద్యమం ఉందన్నారు. కృష్ణా,గుంటూరు జిల్లా పేదలకు కూడా అమరావతిలో స్థలాలు ఇవ్వకూడదని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని.. అలాంటప్పుడు అసలు తామంతా అమరావతికి ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఎత్తపెద్ద విపత్తు వచ్చినా ఉంగరం కూడా ఇవ్వని వారు... అమరావతిలో మాత్రం బంగారు గాజులు కూడా ఇచ్చేశారని పరోక్షంగా భువనేశ్వరిని ఉద్దేశించి పేర్నినాని వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర పేరుతో విశాఖ వెళ్లి అక్కడ గొడవలు చేసి, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న భావన కలిగించేందుకు కుట్ర చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు.

స్వయంగా ఈనాడు పత్రికలోనే చంద్రబాబు దిగిపోయిన తర్వాత ఖజానాలో మిగిలింది 100 కోట్లే, కాబట్టి జగన్‌ పని అంతే అంటూ రాసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు... అన్ని చోట్ల అప్పులు మేమే తెచ్చేశాం ఇక జగన్‌ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే వారు కూడా లేరంటూ కూసిన కారుకూతలు మరిచిపోయారా అని పేర్ని నాని ప్రశ్నించారు. దేశంలోని అనేక రాష్ట్రాలతో పోటి పడి బల్క్ డ్రగ్ పార్కును సాధిస్తే కాలుష్యం అంటూ యనమల కేంద్రానికి లేఖ రాశారని.. ఇదే పెద్ద మనిషి 2015-16లో తునిలో దివీస్ ఫార్మా ఏర్పాటు చేయండి అంటూ తీర్మానం చేశారని గుర్తు చేశారు.

First Published:  8 Sept 2022 4:46 PM IST
Next Story