ఆ నియోజకవర్గాల లిస్ట్ లో పలాస..
మంత్రి అప్పలరాజుకి స్థానికంగా అసమ్మతి వర్గంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయనకు తిరిగి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు.
ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ, వైసీపీ నేతల్లో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులకు వ్యతిరేకంగా స్థానికంగా గ్రూపులు కడుతున్నారు కొందరు. వచ్చే దఫా ఎన్నికల్లో పలానావారికి టికెట్ ఇవ్వొద్దనే విజ్ఞప్తులు ఎక్కువవుతున్నాయి. వారికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామనే బెదిరింపులు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. అలాంటి ఆధిపత్యపోరు నడుస్తున్న నియోజకవర్గాల్లో పలాస కూడా ఒకటి.
అప్పలరాజుకి నిరసన సెగ..
సీఎం జగన్ కేబినెట్-1, 2 లో స్థానం దక్కించుకున్న అతికొద్దిమందిలో మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఒకరు. అయితే స్థానికంగా ఆయనకు అసమ్మతి వర్గంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయనకు తిరిగి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నాయకులు హెచ్చరిస్తున్నారు.
వనభోజనాల్లో హెచ్చరికలు..
శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు సముద్ర తీరంలో వన భోజనాల సందర్భంగా జరిగిన సమావేశంలో అసమ్మతి నేతలు తమ గళం వినిపించారు. మంత్రి నియంతలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యేందుకు తామంతా కలసి పనిచేశామని, కానీ సీనియర్ల నుంచి సహకారం తీసుకుని, ఇప్పుడు వారినే పక్కనపెడుతున్నారని అన్నారు. మంత్రి అయ్యాక మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అవినీతి ఆరోపణలు..
మరోవైపు మంత్రి అవినీతిపై కూడా సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం విశేషం. మంత్రి అవినీతి అక్రమాలపై అధిష్టానం దర్యాప్తు చేయాలని డిమాండు చేశారు అసంతృప్త నేతలు. వైసీపీ జిల్లా కార్యదర్శి, పలాస నియోజకవర్గంలోని మున్సిపాల్టీ నేతలు అప్పలరాజు వ్యతిరేక వర్గంలో ఉన్నారు. మరికొందరు కూడా వారితో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ గొడవలు ముదరకముందే పార్టీ ఈ వ్యవహారంపై దృష్టిసారించాలని అంటున్నారు.