Telugu Global
Andhra Pradesh

జనసేనకు షాక్‌.. నరసాపురం బరిలో టీడీపీ రెబల్‌

నరసాపురంలో ఇటీవల నిర్వహించిన ప్రజాగళంలో మాధవనాయుడు పేరు కూడా ఎత్తలేదు చంద్రబాబునాయుడు. దీంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

జనసేనకు షాక్‌.. నరసాపురం బరిలో టీడీపీ రెబల్‌
X

తెలుగుదేశం, జనసేన మధ్య మరో సీటు చిచ్చు పెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించింది తెలుగుదేశం. జనసేన తరపున బొమ్మిడి నాయకర్‌ను అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ పవన్‌కల్యాణ్‌.

అయితే తెలుగుదేశం నేతలు జనసేనకు సహకరించే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. బొమ్మిడి నాయకర్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు టీడీపీ నేత బండారు మాధవ నాయుడు. అవసరమైతే రెబల్‌గా దిగడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. నరసాపురంలో ఇటీవల నిర్వహించిన ప్రజాగళంలో మాధవనాయుడు పేరు కూడా ఎత్తలేదు చంద్రబాబునాయుడు. దీంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు మాధవనాయుడు.

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన బొమ్మిడి నాయకర్‌ రెండో స్థానంలో నిలవగా.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మాధవనాయుడు మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈసారి కూడా వైసీపీ ముదునూరి ప్రసాదరాజును బరిలో నిలిపింది.

పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 21 సీట్లు మాత్రమే కేటాయించినప్పటికీ.. చాలా చోట్ల టీడీపీ నేతలు జనసేనకు సహకరించే ప్రసక్తి కనిపించడం లేదు. మరికొన్ని చోట్ల టీడీపీ నుంచి వచ్చిన వలసనేతలకు పవన్‌కల్యాణ్ టికెట్లు ఇచ్చారు. ఇక్కడ జనసేన క్యాడర్ అసంతృప్తిలో ఉంది.

First Published:  11 April 2024 7:10 AM GMT
Next Story