చంద్రబాబు అండ్ కో కు షాక్.. పథకాల అమలుకు కోర్టు పర్మిషన్
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యాదీవెన, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు హైకోర్టు అనుమతించింది.
ఏపీలో సంక్షేమ పథకాల సొమ్ము పంపిణీకి ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో కూటమి పార్టీలకు ప్రధానంగా చంద్రబాబు అండ్‌కోకు షాకిచ్చినట్లయింది. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతో చేయూత, ఆసరా, విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ లాంటి నిధులు పంపిణీ జరగకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పథకాలు కొత్తవి కాదని.. ఎప్పటి నుంచో అమలవుతున్నాయని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాల నిధులను ఆపాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులకు నేరుగా అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేస్తారని.. అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకోకుండా ఈసీ షరతులు విధించొచ్చన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. ఈ వాదనలన్ని విన్న కోర్టు గురువారం రాత్రి పొద్దుపోయాక కీలక ఆదేశాలిచ్చింది. ఈసీ ఇచ్చిన ఆదేశాలపై తాత్కాలికంగా స్టే విధించింది.
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యాదీవెన, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు హైకోర్టు అనుమతించింది. ఐతే ఇవాళ ఒక్కరోజు మాత్రమే పంపిణీకి వీలు కల్పించింది. రేపటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఎలాంటి పథకాల నిధులను పంపిణీ చేయరాదని సూచించింది. నిధుల పంపిణీపై ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.