వైఎస్ఆర్ అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం.. షర్మిల దిగజారుడు వ్యాఖ్యలు
మదర్ సెంటిమెంట్ ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. వివేకా హత్య కేసుని హైలైట్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని అర్థం కావడంతో ఇప్పుడు తన తల్లి విజయలక్ష్మి పేరుని కూడా తెరపైకి తెస్తున్నారు షర్మిల.
కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. రోజురోజుకీ మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను జగన్ కోసం ప్రచారం చేశానని, జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీకోసం కష్టపడ్డానని.. గతంలో చెప్పుకునేవారు షర్మిల. కానీ ఇప్పుడామె రూటు మార్చారు. తాజాగా వైఎస్ఆర్ పేరుని తెరపైకి తెచ్చి, మదర్ సెంటిమెంట్ తో ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. తన పుట్టుకని అవమానించారంటూ వైసీపీ నేతలపై షర్మిల చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
తాను రాజశేఖర్‌రెడ్డి బిడ్డను కాదని, ఆయనకు పుట్టలేదని, అలా తన తల్లిని వైసీపీ నేతలు అవమానించారని కడప జిల్లా చెన్నూరు మీటింగ్ లో ప్రస్తావించారు షర్మిల. సజ్జల రామకృష్ణారెడ్డిని ఆమె టార్గెట్ చేసి మాట్లాడారు. అసలామె రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదని ఎవరు, ఎప్పుడు అన్నారో షర్మిల క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ వైసీపీ నేతలు అంత దారుణమైన వ్యాఖ్యలు చేసి ఉంటే ఈపాటికే ఎల్లో మీడియా రచ్చ చేసేది కదా, కనీసం సోషల్ మీడియాలో అయినా ఆ మాటలు వైరల్ అయ్యేవి కదా. వైసీపీ నేతల్ని టార్గెట్ చేయడం కోసమే షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని స్పష్టమైంది. మదర్ సెంటిమెంట్ ని రెచ్చగొట్టి పబ్బంగడుపుకోవాలని చూస్తున్నారు. వివేకా హత్య కేసుని హైలైట్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని అర్థం కావడంతో ఇప్పుడు తన తల్లి విజయలక్ష్మి పేరుని కూడా తెరపైకి తెస్తున్నారు షర్మిల.
పెయిడ్ ఆర్టిస్ట్ లు కాక ఇంకెవరు..?
షర్మిల, సునీత పెయిడ్ ఆర్టిస్ట్ లంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తమను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటారా అంటూ షర్మిల తెగ ఇదైపోతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి, కాంగ్రెస్ కి హోల్ సేల్ గా అమ్మేసి, ఇప్పుడు ఏపీకి వచ్చి ఆమె ఏం సాధిస్తారనేది ప్రశ్నార్థకం. కేవలం చంద్రబాబుకి మేలు చేయడం కోసమే షర్మిల ఏపీకి వచ్చారనే విషయం బహిరంగ రహస్యం. పెయిడ్ ఆర్టిస్ట్ లు కాకపోతే.. చంద్రబాబుని షర్మిల, సునీత ఎప్పుడైనా విమర్శించారా..? కాంగ్రెస్ కి టీడీపీ కూడా వైరి వర్గమే కదా..? ఆ దిశగా షర్మిల ఎప్పుడైనా చంద్రబాబు పాలనను ఎండగట్టారా..? కేవలం జగన్ ని టార్గెట్ చేస్తూ, జగన్ పై నిందలు వేస్తూ పక్కా పెయిడ్ ఆర్టిస్ట్ లు గానే ప్రవర్తిస్తున్నారు షర్మిల, సునీత. వివేకా హత్యపై గతంలో ఎప్పుడూ స్పందించని షర్మిల.. ఇప్పుడు కేవలం రాజకీయం కోసమే ఆ ప్రస్తావన తెస్తున్నారు. అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కడపలో లబ్ధిపొందాలని చూస్తున్నారు.