వైసీపీకి సపోర్ట్ గా షర్మిల ట్వీట్
షర్మిల మాత్రం టీడీపీ పేరెత్తకుండానే ట్వీట్ వేశారు. జరుగుతున్న హింసకు టీడీపీయే కారణం అని ఆమె ప్రస్తావించకపోవడం విశేషం.
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తొలిసారిగా వైసీపీ నేతలు సంతోషపడేలా ఓ ట్వీట్ వేశారు. ఏపీలో వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను కాంగ్రెస్ పార్టీ తరపున తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారామె. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం అని అన్నారు. ఇవి పిరికిపంద చర్యలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.
రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి…
— YS Sharmila (@realyssharmila) June 9, 2024
వైఎస్ఆర్ కి ఓటమి లేదు..
ఏపీలో ఎన్నికల ఫలితాలను వైఎస్ఆర్ కి ఆపాదించడం సరికాదని అంటున్నారు షర్మిల. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం అని, అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని అన్నారు షర్మిల. ఆ మహానేతకు గెలుపు ఓటములు ఆపాదించడం తగదన్నారు. వైఎస్సార్ ను అవమానించేలా ఉన్న హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ తరపున ఆమె డిమాండ్ చేశారు.
టీడీపీ ప్రస్తావనే లేదు..
ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలకు టీడీపీయే ప్రధాన కారణం అనేది వైసీపీ వాదన. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటే.. అది టీడీపీ నేతల పనేనని వేరే చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ షర్మిల మాత్రం టీడీపీ పేరెత్తకుండానే ట్వీట్ వేశారు. జరుగుతున్న హింసకు టీడీపీయే కారణం అని ఆమె ప్రస్తావించకపోవడం విశేషం. పైపెచ్చు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేయడం మరో విశేషం.