షర్మిల ఘాటు వ్యాఖ్యలు.. సాక్షిని టార్గెట్ చేసినట్టేనా..?
ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఆమె నేరుగా సాక్షిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ విషయంలో వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా అవినాష్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ వివేకా వ్యక్తిగత విషయాలు, రెండో పెళ్లి, ఆయన ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి కూడా సాక్షిలో పలు కథనాలు వచ్చాయి. అందులో వివేకా కుమార్తె సునీతను నేరుగా టార్గెట్ చేశారు. సునీత భర్తని కూడా టార్గెట్ చేస్తూ వార్తలొచ్చాయి. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కోర్టులో వేసిన పిటిషన్ల సారాంశం చెప్పే క్రమంలో కూడా సాక్షి.. నేరుగానే సునీతని టార్గెట్ చేసింది. ఈ విషయంలో ఇప్పుడు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా సంస్థలకు వివేకా వ్యక్తిగత విషయాలు మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారామె.
అప్పుడు చంపాల్సింది వివేకాని కాదు, సునీతని..
తన చిన్నాన్న ఆస్తులన్నిటినీ కూతురు సునీత పేరుమీదే కొనుగోలు చేసేవారని, ఆమె పేరుమీదే బదలాయించారని, ఆయన తర్వాత ఆయన ఆస్తులు కూడా సునీత సంతానానికి చెందేలా విల్లు రాయించారని చెప్పారు షర్మిల. ఒకవేళ ఆస్తికోసం వివేకాని కుటుంబ సభ్యులు చంపాలనుకుంటే ఆయన పేరుమీద ఆస్తులేవీ లేవు కాబట్టి, వారి టార్గెట్ సునీత కావాలి కదా అని ప్రశ్నించారు. అసలు ఆస్తుల విషయంలో ఈ హత్య జరిగిందని అనడం అపోహ అని, అసత్య ప్రచారం అని అన్నారు షర్మిల.
వైఎస్ షర్మిల మొదటినుంచీ సునీతకు అండగానే ఉన్నారు. తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, అవినాష్ రెడ్డి కూడా అరెస్టవుతారనే వార్తల నేపథ్యంలో ఏపీలో వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వివేకా రెండో వివాహం, ఆయన వ్యక్తిగత సంబంధాలు, కూతురి కుటుంబాన్ని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈ దశలో ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఆమె నేరుగా సాక్షిని టార్గెట్ చేశారని తెలుస్తోంది. అయితే పేరెత్తకుండా కొన్ని మీడియా సంస్థలంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు షర్మిల. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గురించి కూడా ఆమె మాట్లాడలేదు. తన చిన్నాన్న మంచి వ్యక్తి అని, పేదల కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారని, అలాంటి మంచి మనిషి క్యారెక్టర్ ని తప్పుగా చూపించే ప్రయత్నం తగదన్నారు.