Telugu Global
Andhra Pradesh

అన్న, వదినల దగ్గర షర్మిల అప్పు.. అఫిడవిట్‌లో ఆసక్తికర అంశాలు

తన అన్న జగన్‌ దగ్గర రూ.82 కోట్ల 58 లక్షలు, వదిన భారతి దగ్గర రూ.19 లక్షల 56 వేలు అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు షర్మిల.

అన్న, వదినల దగ్గర షర్మిల అప్పు.. అఫిడవిట్‌లో ఆసక్తికర అంశాలు
X

ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. గతంలో ఎప్పుడూ షర్మిల ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆమె ఆస్తుల వివరాలు బహిర్గతం కాలేదు. తొలిసారిగా షర్మిల తన ఆస్తుల వివరాలు అఫిడవిట్‌లో వెల్లడించారు. వ్యవసాయం, వ్యాపారాలు తన ప్రధాన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు షర్మిల. ఏటా తనకు రూ.97 లక్షల 14 వేల ఆదాయం వస్తుందన్న షర్మిల..భర్త అనిల్‌ కుమార్‌కు ఏటా రూ.3 లక్షల ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు.

అఫిడవిట్ ప్రకారం షర్మిల ఆస్తుల విలువ రూ.182.82 కోట్లుగా ఉంది. ఇందులో చరాస్తుల విలువ రూ.123.26 కోట్లుగా ప్రకటించారు షర్మిల. స్థిరాస్తుల విలువ రూ. 9.29 కోట్లుగా చెప్పారు. షర్మిల భర్త అనిల్ కుమార్ పేరిట రూ.45 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4.05 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్న‌ట్లు తెలిపారు. రూ.3 కోట్ల 69 లక్షల విలువైన బంగారంతో పాటు రూ.4 కోట్ల 61 లక్షల విలువైన జెమ్‌ స్టోన్స్‌ అభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు షర్మిల.

ఇక మరో ఆసక్తికర అంశమేంటంటే.. తన అన్న జగన్‌ దగ్గర రూ.82 కోట్ల 58 లక్షలు, వదిన భారతి దగ్గర రూ.19 లక్షల 56 వేలు అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు షర్మిల. ఇక భర్త అనిల్‌ కుమార్‌కు రూ.29 కోట్ల 99 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు అఫిడవిట్‌లో వివరించారు షర్మిల. విజయమ్మ దగ్గర సైతం అనిల్ కుమార్ రూ.40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇక షర్మిలపై మోడల్ కోడ్ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘనతో పాటు మొత్తం 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

First Published:  20 April 2024 7:30 PM IST
Next Story