మనసులో ఇంత కుట్ర ఉందా..? షర్మిల ఆడియో లీక్
బుల్లిబాబుని వైసీపీ ఓట్లకోసమే ఎంపిక చేశానంటూ అసలు విషయం ఫోన్ లో చెప్పేశారు షర్మిల. అంటే వైసీపీ ఓట్లు చీలితే అక్కడ టీడీపీ లాభపడాలి.. అదీ ఆమె ప్లాన్.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టార్గెట్ ఏంటి..? ఏపీలో కాంగ్రెస్ కి పునర్వైభవం తేవడం ఎంతమాత్రం కాదు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడం అసలేమాత్రం కాదు. ఆమె టార్గెట్ ఒక్కటే.. చంద్రబాబు చెప్పిందల్లా చేయడం, వైసీపీ ఓట్లు చీల్చడం. అవును, షర్మిల వ్యూహం అదే. అందుకే ఆమెను ఏపీ రాజకీయాల్లోకి ఏరికోరి తీసుకొచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టి, వైసీపీకి అడ్డుకట్ట వేసే పని మొదలు పెట్టారు. తాజాగా ఆమె ఫోన్ కాల్ ఆడియో కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాడేరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కేటాయింపులో షర్మిల కుట్ర రాజకీయం బయటపడింది. వాస్తవానికి అక్కడ మొదటినుంచీ కాంగ్రెస్ ని నమ్ముకున్న ఉన్నారు వంతల సుబ్బారావు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన బుల్లిబాబుకి షర్మిల టికెట్ ఖరారు చేశారు. దీంతో సుబ్బారావు రెబల్ గా బరిలో దిగారు. ఆయన్ను బుజ్జగించే క్రమంలో షర్మిల తన అసలు రూపం బయటపెట్టుకున్నారు. వైసీపీ ఓట్లకోసమే తాను బుల్లిబాబుకి టికెట్ ఇచ్చానంటూ ఆసలు విషయం చెప్పేశారు షర్మిల.
షర్మిలమ్మ ఆడియో కాల్ లీక్..!
— YSR Congress Party (@YSRCParty) May 1, 2024
వైయస్ఆర్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకు పాడేరు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
తనకు కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో రెబల్‌గా పోటీలో వంతల సుబ్బారావు
మనకు వైయస్ఆర్సీపీ ఓటు బ్యాంకు చీలడం ముఖ్యం.. పోటీ నుంచి తప్పు కోవాలంటూ సుబ్బారావుకు ఫోన్ చేసి విజ్ఞప్తి. pic.twitter.com/2MrpAwV8WJ
బుల్లిబాబుని వైసీపీ ఓట్లకోసమే ఎంపిక చేశానంటూ అసలు విషయం ఫోన్ లో చెప్పేశారు షర్మిల. అంటే వైసీపీ ఓట్లు చీలితే అక్కడ టీడీపీ లాభపడాలి.. అదీ ఆమె ప్లాన్. వాస్తవానికి షర్మిల సహా ఏపీలో ఏ కాంగ్రెస్ లీడర్ కూడా గెలిచే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ ఈసారి గట్టిగా హడావిడి చేస్తుందంటే దానికి కారణం షర్మిల. టీడీపీతో చేతులు కలిపిన ఆమె, వైసీపీ ఓటమికోసం పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ ద్వారా వైసీపీ ఓట్లు చీల్చి టీడీపీకి సహాయం చేయబోతున్నారు.
ఎన్డీఏ కూటమిని ముస్లింలు ద్వేషిస్తున్నారనే విషయం తెలిసిందే. ఏపీలో ముస్లిం ఓట్లు గంపగుత్తగా వైసీపీకే పడే అవకాశాలున్నాయి. అయితే ముస్లిం ఓటుబ్యాంకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో షర్మిల ఓ కుటిల వ్యూహం పన్నారు. అక్కడ కాంగ్రెస్ తరపున ముస్లిం అభ్యర్థులను బరిలో దింపారు. వీలైనంత వరకు వైసీపీ ముస్లిం ఓటుబ్యాంక్ కి గండి కొట్టాలనేది షర్మిల ఆలోచన. ఆ ఓట్లు ఎలాగూ ఎన్డీఏ కూటమికి పడవు కాబట్టి, వాటిని వైసీపీ వైపు కూడా పోకుండా చూడటం షర్మిల వ్యూహం. వైఎస్ఆర్ కి బద్ధ శత్రువు అయిన చంద్రబాబుకి షర్మిల మద్దతివ్వడం, తన వ్యక్తిగత జీవితంపై నిందలు వేసి, సినీ హీరోతో తనకు సంబంధాలు అంటగట్టిన టీడీపీకి ఆమె వంతపాడటం నిజంగా సిగ్గుచేటని అంటున్నారు వైసీపీ నేతలు.