Telugu Global
Andhra Pradesh

బాబుపై పొగడ్తలు, జగన్ కి తిట్లు.. తీరు మార్చుకోని షర్మిల

గడచిన ఐదేళ్లలో విశృంఖల పాలన జరిగిందని, రాష్ట్రం నాశనమైందని తన లేఖలో పేర్కొన్నారు షర్మిల. అలాంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ప్రజలు చంద్రబాబుకి అధికారమిచ్చారని చెప్పారు.

బాబుపై పొగడ్తలు, జగన్ కి తిట్లు.. తీరు మార్చుకోని షర్మిల
X

ఎన్నికల వేళ సొంత సోదరుడైన వైఎస్ జగన్ ని టార్గెట్ చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కడప పార్లమెంట్ స్థానానికి పోటీ పడిన ఆమె.. గెలుపు కోసం వివేకా హత్యకేసుని రాజకీయంగా వాడుకోవాలని చూశారు. ఆ పన్నాగం ఫలించలేదు, అయితే షర్మిల గెలవకపోయినా.. ఆమె కోరుకున్నట్టుగా ఏపీలో వైసీపీ ఓడిపోయింది. ఆ తర్వాతయినా కనీసం ఆమె రాజకీయంగా బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో అనుకున్నారంతా. కానీ షర్మిల తన అసలు రూపాన్ని పదే పదే బయటపెట్టుకుంటున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆమె విడుదల చేసిన ఓ లేఖ ఈ విషయాన్ని మళ్లీ రుజువు చేసింది.

టార్గెట్ జగన్..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలుపుతూ, అదే సమయంలో ఏపీలో జరుగుతున్న హింసను వెంటనే అరికట్టాలని కోరుతూ షర్మిల ఆయనకు ఓ లేఖ రాశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ, సందర్భం లేకుండా ఆమె జగన్ పాలనను విమర్శించడం ఇక్కడ కొసమెరుపు.


గడచిన ఐదేళ్లలో విశృంఖల పాలన జరిగిందని, రాష్ట్రం నాశనమైందని తన లేఖలో పేర్కొన్నారు షర్మిల. అలాంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ప్రజలు చంద్రబాబుకి అధికారమిచ్చారని చెప్పారు. ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అంతేకానీ.. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనల వల్ల చంద్రబాబు పేరుకి, ఆయన ప్రతిష్టకు మచ్చ వస్తుందన్నారు. అలా రాకూడదంటే హింసాత్మక ఘటనలు ఆగాలని కోరారు.

దాడులు ఆపాలని చెప్పే పద్ధతి ఇదేనా అని నెటిజన్లు షర్మిలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దాడుల గురించి చంద్రబాబుని ప్రశ్నించే సందర్భంలో జగన్ పై నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. షర్మిల కేవలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేశారని, చంద్రబాబుకి ఆమె వంతపాడుతున్నారని విమర్శిస్తున్నారు.

First Published:  12 Jun 2024 4:50 PM IST
Next Story