Telugu Global
Andhra Pradesh

ఆరోపణలు అవే.. అప్పుడు చంద్ర‌బాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా.. ఇప్పుడు షర్మిల

షర్మిల ఆరోపణలను జనాలు ఎంతమంది పట్టించుకుంటున్నారో తెలీదు. ఎందుకంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ పై షర్మిల ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలుసు.

ఆరోపణలు అవే.. అప్పుడు చంద్ర‌బాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా.. ఇప్పుడు షర్మిల
X

ఎల్లోమీడియా పిచ్చి పీక్సుకు చేరుకుంటున్నట్లే ఉంది. ప‌చ్చి ప‌త్రిక అచ్చేసిన‌ ‘దిమ్మతిరిగి అమ్మఒడికి’ అనే స్టోరీని చదివితే ఈ విషయం స్పష్టమైపోతుంది. ఇంతకీ వాటిల్లోని విషయం ఏమిటంటే.. షర్మిల దెబ్బకు జగన్మోహన్ రెడ్డి కూసాలు కదిలిపోతున్నాయట. ఇంతకాలం అన్నీ ప్రతిపక్షాలు కలిపి జగన్ మీద చేసిన ఆరోపణలకు ఎన్నోరెట్లు ఇప్పుడు షర్మిల ఒక్కతే చేస్తున్నారట. ఆమె చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు జగన్ సమాధానం చెప్పుకోలేకపోతున్నారట. పెరిగిపోతున్న ప్రజావ్యతిరేకతకు తోడు ఇప్పుడు చెల్లెలు ఆరోపణలు తోడవ్వటంతో జగన్ కాళ్ళు వణికిపోతున్నాయట.

వచ్చేఎన్నికల్లో ఓటమి గ్యారంటీ అని వెంటనే కేసులు, విచారణ, మళ్ళీ జైలు జీవితం తప్పదని జగన్ కు అర్థ‌మైపోయిందట. అందుకనే రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి తనకు తోడుండాలని తల్లి విజయమ్మను జగన్ బతిమలాడి ఒప్పించారట. షర్మిల అడుగుతున్న ప్రశ్నల్లో జగన్ ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారట. చెల్లెలు అంటే జగన్ ఎంతగా భయపడుతున్నారంటే చివరకు భార్య భారతి లండన్ పర్యటన కూడా రద్దుచేసుకున్నారని ఎల్లోమీడియా తేల్చేసింది.

షర్మిల విజృంభిస్తోందని, అన్నను ఉతికేస్తోందని, జగన్ కాళ్ళు వణికిపోతున్నాయని, ఒకప్పటి బాణమే ఇప్పుడు బల్లెమై గుచ్చుకుంటోందని, ప్రజా వ్యతిరేకతకు తోడు షర్మిల తోడవ్వటంతో ఓటమి ఖాయమని జగన్ డిసైడ్ అయిపోయినట్లు ఏదేదో ఊహించేసుకుని బుర్రకు తోచిన కథలు ఇష్టానుసారంగా వండి వార్చేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే.. జగన్ అంటే మండిపోతున్న షర్మిలను ఎల్లోమీడియా ఎప్పటినుండో రెచ్చగొడుతూనే ఉంది. జగన్ పై షర్మిల చేస్తున్న ఆరోపణలు కొత్తేమీకావు. ఎప్పటినుండో చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లోమీడియా చేస్తున్నవే.

ఇక షర్మిల ఆరోపణలను జనాలు ఎంతమంది పట్టించుకుంటున్నారో తెలీదు. ఎందుకంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ పై షర్మిల ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలుసు. అదే షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ ను బ్రహ్మాండమంటోంది. తన అన్నను తాను ఏమీ కోరలేదని, పదవులు కూడా ఆశించలేదని చెబుతున్న షర్మిల మరెందుకు విభేదాలు వచ్చాయో మాత్రం చెప్పటంలేదు. ఇక్కడ అర్థ‌మవుతున్నది ఏమిటంటే చంద్రబాబు-పవన్ పొత్తుల వివాదం నుండి జనాల దృష్టి మళ్ళించేందుకు ఎల్లోమీడియా శతవిధాల ప్రయత్నిస్తున్నదని. మరి చివరకు ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.

First Published:  28 Jan 2024 11:09 AM IST
Next Story