Telugu Global
Andhra Pradesh

జైలులో షర్మిల.. వైసీపీ వ్యూహాత్మక మౌనం

ఓ రాష్ట్ర సీఎం చెల్లెలు, పక్క రాష్ట్రం జైలులో ఉన్నారంటే కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వైసీపీ నాయకులు చాలామందే హైదరాబాద్ లో ఉన్నా కూడా ఏ ఒక్కరూ విజయమ్మను కానీ, షర్మిలను కానీ పరామర్శించే సాహసం చేయలేదు.

జైలులో షర్మిల.. వైసీపీ వ్యూహాత్మక మౌనం
X

ఏపీ సీఎం జగన్ సొంత సోదరి షర్మిల పొరుగు రాష్ట్రం తెలంగాణలో అరెస్టై జైలులో ఉన్నారు. జగన్ తల్లి విజయమ్మ నిన్న పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేయగా, ఆమెను కారులో ఎక్కించి పంపించేశారు పోలీసులు. ఇవేవీ చిన్న విషయాలు కావు, ఓ రాష్ట్ర సీఎం చెల్లెలు, పక్క రాష్ట్రం జైలులో ఉన్నారంటే కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పోనీ జగన్ నేరుగా ఈ విషయంలో స్పందించకపోయినా ఆ పార్టీ తరపున స్పందించేవారు ఒక్కరూ లేకపోవడం విశేషం. నిన్న మొన్నటి వరకూ విజయమ్మ, వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలోనే ఉన్నారు కదా, కనీసం ఆమెకు కూడా పరామర్శలు లేవు. మొత్తమ్మీద తెలంగాణలో షర్మిల విషయంలో అసలేమీ జరగనట్టే వైసీపీ మౌనంగా ఉంది.

ఆమధ్య విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెబితే టీడీపీ రాద్ధాంతం చేసింది. అప్పట్లో టీడీపీకి కౌంటర్లివ్వడానికి వైసీపీ నుంచి చాలామంది రెడీ అయ్యారు. జగన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పారు కదా, ఆ విషయంలో మీ అత్యుత్సాహమేంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు విజయమ్మ ఒంటరిగానే షర్మిలను కలిసేందుకు చంచల్ గూడ జైలుకి వెళ్లారు. ఆమె చుట్టూ నలుగురు వైఎస్సార్టీపీ నాయకులు మాత్రమే ఉన్నారు. వైసీపీ నాయకులు చాలామందే హైదరాబాద్ లో ఉన్నా కూడా ఏ ఒక్కరూ విజయమ్మను కానీ, షర్మిలను కానీ పరామర్శించే సాహసం చేయలేదు.

పొలిటికల్ గేమ్..

గతంలో షర్మిల, విజయమ్మ వ్యవహారంలో వైసీపీ నాయకులు అడపాదడపా స్పందించేవారు. కానీ ఆ తర్వాత పూర్తిగా మాటలు తగ్గిపోయాయి. తెలంగాణలో వైఎస్సార్టీపీకి సంబంధించి ఏం జరిగినా స్పందించకూడదనే ఆదేశాలు పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఏపీ నాయకులు మౌనాన్ని ఆశ్రయించారు. షర్మిల అరెస్ట్ అయినా, విజయమ్మని పోలీసులు అడ్డుకున్నా.. పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు వైసీపీ నాయకులు. జగన్ జైలులో ఉన్నప్పుడు.. స్వయంప్రకటిత బాణంగా వైసీపీకోసం వచ్చారు షర్మిల, పార్టీకోసం యాత్రలు చేశారు. కనీసం ఆ సింపతీ కూడా ఇప్పుడు వైసీపీనుంచి లేకపోవడం శోచ‌నీయం.

First Published:  25 April 2023 12:01 PM IST
Next Story