Telugu Global
Andhra Pradesh

జగన్ క్రైస్తవుడు.. షర్మిల వ్యాఖ్యల అంతరార్థమేంటి..?

మణిపూర్ లో 2వేల చర్చిలను ధ్వంసం చేశారని, 60వేలమంది క్రైస్తవులు నిర్వాసితులయ్యారని.. క్రిస్టియన్ అయిఉండి కూడా జగన్.. మణిపూర్ ఘటనపై స్పందించలేదని విమర్శించారు షర్మిల.

జగన్ క్రైస్తవుడు.. షర్మిల వ్యాఖ్యల అంతరార్థమేంటి..?
X

ఏపీసీసీ చీఫ్ షర్మిల టార్గెట్ సీఎం జగన్ అని ఆమె తొలి ప్రసంగంతోనే స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆమె ప్రత్యేకంగా జగన్ క్రైస్తవుడంటూ నొక్కిమరీ చెప్పడం మరింత సంచలనంగా మారింది. క్రైస్తవుడైన జగన్ మణిపూర్ అల్లర్ల తర్వాత కనీసం నోరు మెదపలేదన్నారు. ఆ రాష్ట్రంలో 2వేల చర్చిలను ధ్వంసం చేశారని, 60వేలమంది క్రైస్తవులు నిర్వాసితులయ్యారని.. క్రిస్టియన్ అయిఉండి కూడా జగన్ మణిపూర్ ఘటనపై స్పందించలేదని విమర్శించారు షర్మిల. పనిలో పనిగా బీజేపీని టార్గెట్ చేస్తూనే ఆమె, జగన్ ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


క్రిస్టియన్ అనే ప్రస్తావన ఎందుకు..?

ఏపీలో షర్మిల ఏ వర్గం ఓట్లను టార్గెట్ చేశారనేదే ఇప్పుడు అసలు పాయింట్. షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పై క్రైస్తవ వర్గాల్లో సానుభూతి ఉంది. ఇటు షర్మిల కూడా క్రైస్తవుల ఓట్లు గుంపగుత్తగా కాంగ్రెస్ వైపు మార్చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె జగన్ క్రైస్తవత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన క్రైస్తవుల తరపున మాట్లాడటం లేదన్నారు. క్రైస్తవులకు అన్యాయం జరిగినా స్పందించడంలేదని విమర్శించారు. ప్రస్తుతానికి షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కాస్త తక్కువ మోతాదులోనే స్పందించారు. కేవలం ఆయన ప్రత్యేక హోదా విషయంలో షర్మిల వ్యాఖ్యలను ఖండించారు. అసలు రాష్ట్ర విభజనకు కారణం అయిన కాంగ్రెస్ ని ఆయన నిందించారు. ముందు ముందు షర్మిల వ్యాఖ్యలు ఎలా ఉంటాయి, వాటికి వైసీపీ రియాక్షన్లు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.

జిల్లా యాత్రలకు రెడీ..

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న షర్మిల వెంటనే జిల్లా యాత్రలకు రెడీ అవుతున్నారు. ఈనెల 23న ఆమె జిల్లా యాత్రలు మొదలవుతాయి. మొత్తం 9రోజులపాటు జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు. ఆయా జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులను ఎన్నికలకు ఆమె సమాయత్తం చేస్తారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల లిస్ట్ కూడా ఈ పర్యటనలోనే షర్మిల సిద్ధం చేస్తారని అంటున్నారు.

First Published:  21 Jan 2024 6:41 PM IST
Next Story