Telugu Global
Andhra Pradesh

నష్టం లేదు, మాకేం నష్టం లేదు..

వైసీపీ నుంచి కూడా వరుస రియాక్షన్లు వస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని.. ఇలా వరుసగా షర్మిల చేరికపై నేతలంతా స్పందిస్తున్నారు.

నష్టం లేదు, మాకేం నష్టం లేదు..
X

కాంగ్రెస్ లో షర్మిల చేరిక ఏపీ రాజకీయాలను ఎంతవరకు ప్రభావితం చేయగలదు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ప్రశ్న. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి వైసీపీ బలపడుతుందనే వాదన ఉంది. లేదు లేదు వైసీపీ, టీడీపీ అసంతృప్తులతో కాంగ్రెస్ బలపడుతుందని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. షర్మిల ప్రస్థానంపై ఎక్కువగా స్పందిస్తున్నది మాత్రం వైసీపీ నేతలే. కుటుంబ సభ్యులనుంచి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం షర్మిల ఎంట్రీపై తమదైన విశ్లేషణ ఇస్తున్నారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక వైసీపీకి ఏమాత్రం నష్టం చేయదని స్టేట్ మెంట్లిస్తున్నారు.

షర్మిల ఎంట్రీకి ముందే ఆ వ్యవహారంపై పరోక్షంగా స్పందించారు సీఎం జగన్. కుటుంబాలను చీల్చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సాక్షి కూడా షర్మిలకు స్పేస్ కేటాయించాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో షర్మిల చేరిక వైసీపీకి ఎలాంటి నష్టం చేయదు అనే విధంగా ఆర్టికల్స్ వచ్చేశాయి. పనిలో పనిగా ఇదంతా చంద్రబాబు డైరక్షన్లో జరిగిందని కూడా సాక్షి చెప్పేసింది. చంద్రబాబుకి అంత సీన్ ఉందనుకోలేం కానీ.. షర్మిలను చంద్రబాబు టీమ్ లో పడేయడం వల్ల వైసీపీకి లాభం ఉండటమే ఈ వ్యాఖ్యానాల వెనక అసలు ఉద్దేశం.

ఇక వైసీపీ నుంచి కూడా వరుస రియాక్షన్లు వస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి కూడా స్పందించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా.. తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారాయన. ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని.. ఇలా వరుసగా షర్మిల చేరికపై నేతలంతా స్పందిస్తున్నారు. అందరి మాట ఒకటే.. "షర్మిల మాకు ప్రత్యర్థి, ఆమె కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు."

షర్మిల వల్ల కాంగ్రెస్ కి కలిగే ప్రయోజనం ఏంటి..?

తెలంగాణ విషయానికొస్తే అక్కడ షర్మిల ప్రభావం శూన్యం. కొత్త పార్టీ పెట్టినా ప్రయోజనం లేదు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బేషరతుగా కాంగ్రెస్ కి మద్దతిచ్చి తన గౌరవం కాపాడుకున్నారు షర్మిల. తనవల్లే కాంగ్రెస్ గెలిచిందని ఆమె చెప్పుకున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇక ఏపీ విషయానికొస్తే ఏం జరుగుతుందనేది చూడాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నేతలు ఒకరిద్దరు ఆమెవైపు వెళ్లొచ్చు. కాంగ్రెస్ టికెట్ పై గెలుస్తామనే ధీమా లేకపోయినా.. కనీసం కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పుకోడానికి ఆశపడేవాళ్లు ఆవైపు వెళ్లి కాస్తో కూస్తో చేతి చమురు వదిలించుకోవచ్చు. అకస్మాత్తుగా ఏపీ ప్రజలు కాంగ్రెస్ ని ప్రత్యామ్నాయంగా భావించే అవకాశం లేదు. రాగా పోగా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీ మాత్రమే లాభపడుతుందని చెప్పాలి.

First Published:  5 Jan 2024 8:13 AM IST
Next Story