ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి ఏకగ్రీవం..!
అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శి పదవికి ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపినాథ్ రెడ్డి నామినేషన్ వేశారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఎన్నిక ఖాయమైంది. ఈసారి ఆయనకు పోటీగా ఎవరూ బరిలో దిగిలేదు. దాంతో ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్‌లో ఆరు స్థానాలకు డిసెంబర్ 3న ఎన్నిక జరగాల్సి ఉంది. శనివారం సాయంత్రంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఆరు స్థానాలకు కేవలం ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. దాంతో ఎన్నిక అవసరం లేకుండానే ఆరుస్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శి పదవికి ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపినాథ్ రెడ్డి నామినేషన్ వేశారు. వారంతా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 21తో ముగుస్తుంది. ఆ తర్వాత ఏకగ్రీవంగా వీరంతా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీ మద్యం లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన తరపు ప్రతినిధులు నామినేషన్ వేశారు.