Telugu Global
Andhra Pradesh

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. రూ.243.34 కోట్ల నగదు పురస్కారాలు

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ.243.34 కోట్ల నగదు పురస్కారాలు అందజేస్తుంది ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు వాలంటీర్లకు మొత్తంగా రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం వెచ్చించినట్టయింది.

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. రూ.243.34 కోట్ల నగదు పురస్కారాలు
X

ఏపీలో ఈరోజునుంచి వాలంటీర్లకు వందనం కార్యక్రమం మొదలవుతోంది. గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం నగదు పురస్కారాలు అందజేస్తుంది. మొత్తం రూ.243.34 కోట్ల రూపాయలను వాలంటీర్లకు నగదు ప్రోత్సాకంగా అందిస్తారు. ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరు­సగా మూడో ఏడాది ఈ పురస్కారాలు అందిస్తున్నట్టు తెలిపింది ప్రభుత్వం.

ఎందుకీ పురస్కారాలు..?

ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థతోపాటు వాలంటీర్లను కూడా ప్రభుత్వం నియమించింది. 50 ఇళ్లకు సంబంధించి వారికి బాధ్యతలు అప్పగించింది. అయితే వారికి నెలకు 5వేల రూపాయల గౌరవ వేతనం ఫిక్స్ చేశారు. దాన్ని పెంచాలని, తమను ఉద్యోగస్తులుగా గుర్తించాలని వాలంటీర్ల నుంచి డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో వారి జీతాలు పెంచకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నగదు పురస్కారాలను ప్రవేశ పెట్టింది. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ.243.34 కోట్ల నగదు పురస్కారాలు అందజేస్తుంది ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు వాలంటీర్లకు మొత్తంగా రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం వెచ్చించినట్టయింది. ఈరోజునుంచి పురస్కారాల ప్రదానోత్సవం మొదలవుతుంది. అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాలంటీర్లకు అవార్డులు అందిస్తారు.

సేవా మిత్రలకు 10వేల రూపాయల నగదు బహుమతి ఇస్తారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 2,28,624 మందిని ఎంపిక చేశారు. సేవారత్నలకు 20వేల రూపాయల నగదు ప్రోత్సాహకం ఇస్తారు. 4,220 మందిని సేవా రత్నలుగా ఎంపిక చేశారు. సేవా వజ్ర పురస్కారం కింద ఒక్కొకరికి 30వేల రూపాయల నగదు ఇస్తారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి 875 మందిని సేవా వజ్ర పురస్కారాలకు ఎంపిక చేశారు.

First Published:  19 May 2023 9:19 AM IST
Next Story