వైఎస్ వివేకా హత్య కేసు.. కోర్టు సంచలనం
కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. తప్పుడు ప్రచారం వల్ల ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేకా హత్య అంశాన్ని ప్రస్తావించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, షర్మిల దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారంటూ కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. తప్పుడు ప్రచారం వల్ల ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
సురేష్ బాబు పిటిషన్‌పై విచారణ చేపట్టిన కడప కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, బీజేపీ స్టేట్ చీఫ్ పురందేశ్వరీతో పాటు నారా లోకేష్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ షర్మిలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో చంద్రబాబుతో పాటు షర్మిలకు షాక్ తగిలినట్లయింది.