Telugu Global
Andhra Pradesh

ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

చంద్రబాబును మరి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఏసీబీ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
X

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. రూ.550 కోట్ల స్కామ్‌లో కీలక సుత్రధారి అప్పటి సీఎం చంద్రబాబే అని సీఐడీ అధికారులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టును కోర్టు అంగీకరించింది. నిన్న ఉదయం 6 గంటలకు నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబును రోడ్డు మార్గంలో అమరావతి తరలించారు. రాత్రంతా సీఐడీ కార్యాలయంలోనే సుదీర్ఘ విచారణ జరిపిన అధికారులు చంద్రబాబు స్టేట్మెంట్ రికార్డు చేశారు.

చంద్రబాబుపై 34 అభియోగాలతో రిమాండు రిపోర్టు తయారు చేసిన సీఐడీ.. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఏసీబీ కోర్టుకు తీసుకొని వచ్చారు. మొత్తం 28 పేజీల రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టులో సమర్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిన తీరును సీఐడీ తరపున వాదించిన ఏఏజీ వివరించడంతో పాటు.. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్ అయ్యిందని జడ్జికి తెలిపారు. ఉదయం నుంచి దాదాపు 8 గంటలకు పైగా పలు దఫాలుగా జడ్జి ఇరు పక్షాల వాదనలు విన్నారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తరపున సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు తన వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టులో పెట్టిన సెక్షన్ 409, 17ఏపై బలమైన వాదనలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈ సెక్షన్లు చంద్రబాబుకు వర్తించవని కోర్టుకు తెలిపారు. కాగా, సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ స్కాంలో కీలక సూత్రధారి చంద్రబాబే అని.. ఆయనకు అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు రిలీజ్ అయ్యాయని కూడా రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.

చంద్రబాబుకు కుట్రకు ఆధారాలు ఉన్నాయి : ఏసీబీ కోర్టు

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి తీర్పును రిజర్వు చేశారు. సాయంత్రం 6.30 తర్వాత తీర్పును చదివి వినిపించారు. ఈ స్కామ్‌లో చంద్రబాబు కుట్రకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. ఈ కేసును విచారించిన సిట్ చేసిన వాదనలతో ఏసీబీ జడ్జి ఏకీభవించారు. దీంతో చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. బాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

కాగా, చంద్రబాబును మరి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఏసీబీ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. భారీ భద్రత నడుమ చంద్రబాబును ఈ రాత్రి లోగా రాజమండ్రి తరలిస్తారని తెలుస్తున్నది.

First Published:  10 Sept 2023 7:19 PM IST
Next Story