మావాళ్లతో బలవంతంగా సంతకాలు !- మార్గదర్శి, సంచలన పరిణామాలు ఖాయమా..?
ఆసక్తికరంగా ఈనాడు పత్రిక కూడా మొదటి పేజీలో మార్గదర్శిపై కక్ష సాధింపు అంటూ పెద్ద కథనాన్ని ప్రచురించి ప్రభుత్వంపై ఎదురుదాడి చేసింది.
మార్గదర్శి సంస్థ కార్యాలయాల్లో తనిఖీల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తనిఖీల్లో మార్గదర్శి సంస్థ భారీగా ఉల్లంఘనలకు పాల్పడినట్టు అధికారులు తేల్చారు. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా సాగిన వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లను సీజ్ చేశారు. కస్టమర్లు చెల్లించిన నిధులను దారి మళ్లించడం, జీఎస్టీ ఎగవేత, కంపెనీ పాడిన చిట్‌లకు గ్యారెంటీ చూపకపోవడం వంటి అక్రమాలకు పాల్పడినట్టు తేల్చారు.
తనిఖీల సందర్భంగా చేసే పంచనామా రిపోర్టుపై సంతకాలు చేసేందుకు కార్యాలయాల మేనేజర్లు నిరాకరించారు. అన్ని బ్రాంచ్‌ల్లోనూ మేనేజర్లు ఇలాగే మొండికేశారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే మేనేజర్లు సంతకాలు చేయడం లేదని.. తమకు తెలియకుండానే ఏకపక్షంగా అధికారులు ముందుకెళ్లారని వాదించేందుకే ఇలా సంతకాలు పెట్టేందుకు నిరాకరించారని అధికారులు భావిస్తున్నారు.
ఆసక్తికరంగా ఈనాడు పత్రిక కూడా మొదటి పేజీలో మార్గదర్శిపై కక్ష సాధింపు అంటూ పెద్ద కథనాన్ని ప్రచురించి ప్రభుత్వంపై ఎదురుదాడి చేసింది. ఎలాంటి ఉల్లంఘనలు కనిపించకపోవడంతో తప్పుడు ఆరోపణలతో డాక్యుమెంట్లు సృష్టించి వాటిపై సంతకాలు చేయాల్సిందిగా మేనేజర్లపై ఒత్తిడి తెస్తున్నారని మార్గదర్శి ఆరోపించింది. ఈ ఆరోపణలతో గురువారం రాత్రి మార్గదర్శి ఉన్నత సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏమీ లేకున్నా మూడు రోజులుగా తమ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉద్యోగులకు, ఖాతాదారులకు ఇబ్బంది కలిగించారని మార్గదర్శి ఆరోపించింది. ఎలాగైనా ఏదో ఒకలోపాన్ని కనిపెట్టాలని ఉన్నతాధికారుల నుంచి పదేపదే ఆదేశాలు రావడంతో తప్పుడు ఆరోపణలతో పత్రాలు సృష్టించారని.. దాన్నే కోర్టులో సంస్థకు వ్యతిరేకంగా ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మార్గదర్శి తన ప్రకటనలో ఆరోపించింది.
మేనేజర్లు సంతకాలు పెట్టకపోవడంతో రెండు రోజుల్లోగా ఆ పనిచేయాలని లేకుంటే మరో దారిలో వెళ్లాల్సి ఉంటుందని అధికారులు బెదిరించారని కూడా మార్గదర్శి సంస్థ తన ప్రకటనలో ఆరోపించింది. అటు అధికారుల చర్యలు, ఇటు ఈనాడులో ఎదురుదాడి బట్టి చూస్తుంటే ఈ వ్యవహారంలో సంచలన పరిణామాలే చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.