Telugu Global
Andhra Pradesh

వలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

గత ప్రభుత్వాల్లో లబ్దిదారులను ఉద్యోగులే గుర్తించే వారు కదా.. ఇప్పుడు కొత్తగా ఈ వ్యవస్థ ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగుల‌పై నమ్మకం లేక ఈ వ్యవస్థను తెచ్చారా..? అని నిలదీసింది.

వలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

వలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కారణాలతో లబ్దిదారుల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన 26 మంది గ‌తంలో హైకోర్టును ఆశ్రయించారు.

తాజాగా మంగళవారం మరోసారి హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థకు ఉన్న చట్టబద్ధత ఏంటి అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వలంటీర్ల వ్యవస్థను తెచ్చారా అని ధ‌ర్మాస‌నం ప్రశ్నించింది. ఎలాంటి జవాబుదారీతనం, సర్వీస్ రూల్స్ లేని వలంటీర్లకు లబ్దిదారుల ఎంపికను ఎలా అప్పగిస్తారని ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది.

తాము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని.. వాటిని అందించేందుకు అనుసరిస్తున్న విధానమే బాగోలేదని వ్యాఖ్యానించింది. చట్టం అనుమతిస్తే వలంటీర్ల సర్వీస్‌ను క్రమబద్ధీకరించి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

గత ప్రభుత్వాల్లో లబ్దిదారులను ఉద్యోగులే గుర్తించే వారు కదా.. ఇప్పుడు కొత్తగా ఈ వ్యవస్థ ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగుల‌పై నమ్మకం లేక ఈ వ్యవస్థను తెచ్చారా..? అని నిలదీసింది. కోర్టు లేవనెత్తిన అంశాలపై వివరణతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ మార్చి 10కి కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.

ఈ పిటిషన్‌పై ఈనెల 21న కూడా జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం విచారణ జరిపి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లబ్దిదారుల ఎంపికలో వలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు నేరుగా సెర్ప్‌ సీఈవో కోర్టుకు హాజరుకావాలని గత వాయిదాలో జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశించారు.

First Published:  28 Feb 2023 9:22 PM IST
Next Story