నరసరావుపేట.. ఇరుపార్టీల్లోనూ సీటు వేట
పేదల డాక్టర్‌గా పేరుగాంచిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మెతకవైఖరి, శాంతస్వభావం పల్నాడు రాజకీయాలకు అస్సలు సూటు కాదు. అయినా తెలుగుదేశం పార్టీ అప్పగించిన కార్యక్రమాల నిర్వహణలో కష్టనష్టాలకు ఓర్చుతూ నడిపిస్తున్నారు.
ఎంతో చరిత్ర కలిగిన నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఎన్నికల రణరంగాన్ని తలపిస్తుంటాయి. అధికార విపక్షాల మధ్య పోరుతో రాష్ట్ర వ్యాప్తంగా నరసరావుపేట వార్తలో నిలుస్తూ వస్తుంది. స్వపక్షంలో విపక్షాల గొడవలు అటు వైసీపీ, ఇటు టీడీపీలోనూ కొనసాగుతున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2024లోనూ వైసీపీ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఆయనకి అసమ్మతి సెగ తగులుతోంది.
పక్క నియోజకవర్గ నేతలు, మాజీ మంత్రులు నరసరావుపేట అయితే వైసీపీ నుంచి గెలవడానికి సురక్షితమైన నియోజకవర్గమని భావిస్తున్నారు. మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి నరసరావుపేట నుంచి పోటీ చేయాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఇటువైపే చూస్తున్నారట. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. కష్టకాలంలో పార్టీ కార్యక్రమాలు నడిపించే బాధ్యత తీసుకున్నారు. నియోజకవర్గంలో కమ్మ, రెడ్డి, ముస్లిం, వైశ్య, కాపు, ఎస్సీ ఓటర్లు గణనీయంగా వున్నారు. ఏ పార్టీ అయినా అభ్యర్థులు అగ్రవర్ణాల వారే ఉంటారు. దీంతో వెనకబడిన వర్గాలకి చెందిన అరవింద్ బాబుకి స్థానికంగా పార్టీ నుంచి సహకారం అంతంతమాత్రమేనని తెలుస్తోంది.
పేదల డాక్టర్‌గా పేరుగాంచిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మెతకవైఖరి, శాంతస్వభావం పల్నాడు రాజకీయాలకు అస్సలు సూటు కాదు. అయినా తెలుగుదేశం పార్టీ అప్పగించిన కార్యక్రమాల నిర్వహణలో కష్టనష్టాలకు ఓర్చుతూ నడిపిస్తున్నారు. అధికారంతోపాటు దౌర్జన్యకర రాజకీయాలకు పెట్టింది పేరైన వైసీపీతో ఢీకొట్టడంలో చదలవాడ రాటుదేరారు. రేషన్ బియ్యం, లిక్కర్ దందాలపై ఉద్యమం సాగిస్తున్నారు. పార్టీ అధికారంలో లేని ఈ నాలుగేళ్లలో అందరినీ సమన్వయం చేసుకోవడం అరవింద్ బాబుకి తలకుమించిన భారంగా మారింది. ముప్పయి వేలకు పైగా మెజారిటీతో ఓడిపోయిన చోట టీడీపీకి భవిష్యత్తు లేదని సెకండ్ కేడర్ మౌనందాల్చారు. టీడీపీకి అంటీముట్టనట్టు ఉండేవారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. టీడీపీకి కూడా జనాదరణ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేటలో టీడీపీ గెలవకపోయినా, రాష్ట్రంలో అధికారం రావడం ఖాయమని నిర్ణయించుకున్న కొందరు టీడీపీ నేతలు సీటు పోటీలో ముందుకొచ్చారు.
ఇన్నాళ్లూ మౌనంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న టీడీపీ నేతలు నల్లపాటి రాము, డాక్టర్ కోడెల శివరాం, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, రావెళ్ల సత్యనారాయణ వంటి వారు టికెట్ రేసులో ముందుకొచ్చారు. వీరితోపాటు సంతమాగులూరు మండలం నుంచి రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా మరో నేత నరసరావుపేట టీడీపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. బీసీనైన తనకు పార్టీలో ఓ అగ్రకుల నేతలు సహకరించడంలేదని అరవింద్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు నాలుగేళ్లుగా రోడ్లపైకి వచ్చి పోరాడుతూ పోలీసు లాఠీల దెబ్బలు, అక్రమ కేసులు, కోర్టు వాయిదాలు, దాడులు అరవింద్ బాబు ఎదుర్కొని నిలిచారని, ఈ కాలంలో వీరంతా ఏమయ్యారని డాక్టర్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
సత్తెనపల్లిలో సీటు డౌట్ కావడంతో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం నరసరావుపేట అయినా తనకు ఇవ్వాలని అధిష్టానానికి విన్నవిస్తున్నారట. నల్లపాటి రాము తానైతే పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లగలనని, వైసీపీ అరాచకాలను ఎదుర్కోగలనని పార్టీ పెద్దల ముందు ప్రతిపాదన పెట్టారని సమాచారం. డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, రావెళ్ల సత్యనారాయణ ఆర్థికంగా-సామాజికవర్గపరంగా తమ బలం చూపుతూ టికెట్ రేసులోకొచ్చారు.