రాజకీయాల్లోకి వస్తా.. సినీ నటుడు సుమన్.. - తన మద్దతు బీఆర్ఎస్‌కే అని వెల్లడి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అంతేకాదు.. తెలంగాణలో తన మద్దతు బీఆర్ఎస్‌కే అని స్పష్టం చేశారు.
సినీ నటుడు సుమన్.. హీరోగా ఒక వెలుగు వెలిగి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నిండైన రూపం కావడంతో.. ఆయన పోషించే పాత్రలకు ఆటోమేటిగ్గా హుందాతనం వచ్చేస్తుంది. అందుకే సాధారణంగా కీలక పాత్రలు, హుందాతనం ఉట్టిపడే క్యారెక్టర్లకు దర్శకులకు ఆయన బెస్ట్ చాయిస్.
సినిమాలతో పాటు చాలాకాలంగా సమాజ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు సుమన్. వీలుచిక్కినప్పుడల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరిగే పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. వివిధ సంఘాల నాయకులతోనూ ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. అలాగే రాజకీయ అంశాలపైనా తనదైన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
రాజకీయ నాయకులతోనూ టచ్‌లో ఉంటుండటం, రాజకీయ అంశాలపైనా అభిప్రాయాలు వెల్లడిస్తుండటంతో ఆయనకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పటికైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని అందరూ భావించారు. ఇప్పుడు దానినే నిజం చేస్తూ.. తాను రాజకీయాల్లో వస్తానని ప్రకటించి ఈ ఊహాగానాలకు తెరదించారు సుమన్.
బుధవారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అంతేకాదు.. తెలంగాణలో తన మద్దతు బీఆర్ఎస్‌కే అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు, విపత్తులు ఏటా ఉండేవేనని, ఆ దిశగా ముందస్తు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు. రైతులు కోరేది కూడా కొంచెమేనని.. ఏ ప్రభుత్వమైనా వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.