పులివెందులలో సెల్ఫీ సందడి
జగన్ రాక తెలుసుకున్న స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పులివెందులకు వస్తున్నారు.
జగన్ ఎక్కడికి వెళ్లినా ఆయన్ను చూసేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకు, వీలైతే సెల్ఫీ దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం సహజం. ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో కూడా సెల్ఫీల సందడి కొనసాగుతోంది. జగన్ ని చూసేందుకు, వివిధ సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు ఇచ్చేందుకు జనం పెద్ద సంఖ్యలో పులివెందుల క్యాంప్ ఆఫీస్ కి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
— YSR Congress Party (@YSRCParty) July 7, 2024
2019 ఎన్నికల సమయంలో జగన్ పాదయాత్రలో చాలామంది ఆయనకు దగ్గరగా వెళ్లి ఫొటోలు దిగారు, సెల్ఫీలతో సందడి చేశారు. జగన్ సీఎం అయ్యాక సెక్యూరిటీ కారణాల వల్ల జనంతో కాస్త గ్యాప్ పెరిగింది. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ మరోసారి ప్రజల్లోకి వచ్చారు. సిద్ధం సభలు, బస్ యాత్రల సందర్భంగా ఆయన జనానికి దగ్గరయ్యారు. అప్పుడు కూడా సెల్ఫీలకోసం జనం ఆయన్ను చుట్టుముట్టారు. ఇప్పుడు పులివెందుల పర్యటనలో జగన్ పూర్తిగా ప్రజలకు టైమ్ కేటాయించడంతో ఆయన్ను కలిసేందుకు దూర ప్రాంతాలనుంచి కూడా ప్రజలు వస్తున్నారు. వచ్చినవారందరికీ జగన్ ని కలిసే అవకాశం లభిస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఫొటోలు దిగుతున్నారు.
ఇటీవల పులివెందుల పర్యటన ముగించుకున్న అనంతరం బెంగళూరు వెళ్లి తిరిగి తాడేపల్లికి వచ్చిన జగన్, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మరోసారి పులివెందులకు వచ్చారు. మూడురోజులు ఇక్కడే ఉంటారు. జగన్ రాక తెలుసుకున్న స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పులివెందులకు వస్తున్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్తారు జగన్. ఆ తర్వాత తాడేపల్లికి తిరిగి వెళ్తారు.