Telugu Global
Andhra Pradesh

బాబును ఢిల్లీకి ఆహ్వానించిన కేంద్రం.. పచ్చ మీడియాలో ఆహా ఓహో అంటూ కథనాలు..

డిసెంబర్ 5న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్‌ చేసి ఆహ్వానించినట్టు సమాచారం.

బాబును ఢిల్లీకి ఆహ్వానించిన కేంద్రం..  పచ్చ మీడియాలో ఆహా ఓహో అంటూ కథనాలు..
X

గత ఎన్నికల ముందు టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు బీజేపీని, అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని బండ బూతులు తిట్టిన విషయం తెలిసిందే. బీజేపీని గద్దె దించుతానంటూ శపథాలు కూడా చేశారు. ఇక మోడీని, అమిత్ షాను తిట్టిపోశారు. కానీ ఆ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు. ఇక ఆ వెంటనే చంద్రబాబు స్వరం మర్చారు. బీజేపీపై సాఫ్ట్ కార్నర్ అలవర్చుకున్నారు. పైగా అవకాశం ఉంటే బీజేపీ పెద్దలను కలిసి సారీ చెప్పేందుకు కూడా సిద్ధపడిపోయారేమే తెలియదు.

ఇదిలా ఉంటే ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా కూడా చంద్రబాబుకు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సఖ్యత కుదుర్చాలని తెగ ఆరాటపడుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం కూడా టీడీపీ అర్రులు చాస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు.. కానీ వేరే రకమైన సాయాల కోసం బీజేపీతో మైత్రి కొనసాగించాలని చూస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు పొరపాటునో.. గ్రహపాటునో ఢిల్లీ వెళితే.. ఆయన చక్రం తిప్పేస్తారని, ఢిల్లీ పెద్దలతో సఖ్యత కోసం పావులు కదుపుతున్నారని ఎల్లో మీడియా రాతలు రాస్తూ ఉంటుంది.

తాజాగా చంద్రబాబుకు ఢిల్లీ రావాల్సిందిగా కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. డిసెంబర్ 5న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్‌ చేసి ఆహ్వానించినట్టు సమాచారం. జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుకు సంబంధించి వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది.

అయితే ఈ ఆహ్వానంపై పచ్చ మీడియాలో చిలువలు పలువలుగా వార్తలు వస్తున్నాయి. మరోసారి చంద్రబాబు, మోడీ సమావేశం కాబోతున్నారని.. ఏపీ రాజకీయాలపై పొత్తులపై కూడా ఇక్కడ చర్చిస్తారేమోనని కూడా కథనాలు వెలువడుతునాయి. మరి చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఏం సాధిస్తారో.. వేచి చూడాలి.

First Published:  23 Nov 2022 9:35 AM GMT
Next Story