Telugu Global
Andhra Pradesh

సచివాలయం స్టాఫ్ జగన్ కి హ్యాండిచ్చినట్టేనా..?

సచివాలయ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, పట్టభద్రులైన వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులంతా వైసీపీకే ఓట్లు వేస్తే మూడుచోట్లా ఆ పార్టీయే గెలవాల్సిన పరిస్థితి. కానీ సీన్ రివర్స్ అయింది.

సచివాలయం స్టాఫ్ జగన్ కి హ్యాండిచ్చినట్టేనా..?
X

నిరుద్యోగ సమస్య గురించి ప్రతిపక్షం ఎప్పుడు ప్రశ్నించినా వైసీపీ నుంచి వచ్చే సమాధానం ఒకటే. అధికారంలోకి రాగానే 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతుంటారు నేతలు. ఒకరకంగా ఇప్పుడు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ధైర్యంగా అభ్యర్థులను బరిలో దించడానికి కూడా కారణం అదే. సచివాలయ ఉద్యోగులు వైసీపీకి నమ్మకంగా ఉంటారని, కచ్చితంగా వైసీపీ అభ్యర్థులకు అండగా నిలబడతారనేది వారి అంచనా. సచివాలయ ఉద్యోగులతోపాటు వాలంటీర్లలో ఉన్న పట్టభద్రులు కూడా వైసీపీకి పటిష్ట ఓటుబ్యాంక్ అనే ధైర్యం ఆ పార్టీలో ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆ నమ్మకాని వమ్ముచేశాయి. సచివాలయ ఉద్యోగుల ఓట్లు వన్ సైడ్ గా వైసీపీకి పడలేదనే చేదు నిజాన్ని బయటపెట్టాయి.

ఆంధ్రప్రదేశ్ లోని 13 ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది జిల్లాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలవారీగా లెక్క చూస్తే, తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఇంచుమించు 92,769 మంది సచివాలయ ఉద్యోగులుంటారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వైసీపీకే నమ్మకంగా ఉంటారనేది ప్రభుత్వ అంచనా. సచివాలయ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, పట్టభద్రులైన వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులంతా వైసీపీకే ఓట్లు వేస్తే మూడుచోట్లా ఆ పార్టీయే గెలవాల్సిన పరిస్థితి. కానీ సీన్ రివర్స్ అయింది. అంటే వీరంతా వైసీపీకి ఓటు వేయలేదు, కనీసం మెజార్టీ సంఖ్యలో కూడా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంవైపు లేరు అనేది బహిరంగ రహస్యం అనే చెప్పుకోవాలి.

ఊహించని విధంగా టీచర్ల నియోజకవర్గంలో వైసీపీకి రెండు విజయాలు దక్కాయి. ఒకరకంగా టీచర్లే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని అనుకున్నారంతా. ఇక్కడ ప్రైవేటు టీచర్ల ఓట్లు కూడా తోడవడం, ప్రభుత్వ టీచర్లలో కొంతమంది వైసీపీ అభ్యర్థికి మద్దతివ్వడంతో ఆ పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. కానీ కచ్చితంగా తమవే అనుకున్న పట్టభద్రుల స్థానాలు మాత్రం షాకిచ్చాయి.

ఎవరు ఎటువైపు..?

సచివాలయాలను ఏర్పాటు చేసింది, ఉద్యోగాలు సృష్టించింది జగనే కావొచ్చు. అంత మాత్రాన అందరూ వైసీపీకి మద్దతు తెలుపుతారని అనుకోలేం. సంక్షేమ పథకాల లబ్ధిదారుల పరిస్థితి కూడా అంతే. నూటికి 80శాతం మందికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అందరూ మనవాళ్లే అనే అంచనాలు పెట్టుకుంటే కష్టమే.

First Published:  18 March 2023 4:31 PM IST
Next Story