సీట్లపై తేలిన లెక్క.. జనసేనకు మళ్లీ బొక్క
పొత్తులో భాగంగా మొదటి నుంచి జనసేన తనను తగ్గించుకుంటూ వస్తోంది. చంద్రబాబు మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. మొదట 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలకు అంగీకరించారు పవన్‌కల్యాణ్.
ఏపీలో ఎట్టకేలకు పొత్తుల లెక్క తేలింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేనల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. కానీ, చివర్లో జనసేనకు పెద్ద బొక్క పడింది. ముందుగా ప్రకటించిన అసెంబ్లీ సీట్లలో జనసేనకు మళ్లీ కోత పడింది. అటువైపు బీజేపీ కోటా పెరిగింది.
సీట్ల పంపకాలపై మూడు పార్టీలు సోమవారం రాత్రి ఉమ్మడి ప్రకటన చేశాయి. ఈ ప్రకటన ప్రకారం.. తెలుగుదేశం 144 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయనుంది. ఇక ముందునుంచి ఊహించినట్లుగానే జనసేన మళ్లీ తన కోటాలో నుంచి 3 అసెంబ్లీ స్థానాలను త్యాగం చేసింది. దీంతో ఇప్పుడు జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీకి పరిమితం కానుంది. ఇప్పటికే ఓ ఎంపీ స్థానం బీజేపీకి త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఒక్క అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది. దీంతో బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది.
పొత్తులో భాగంగా మొదటి నుంచి జనసేన తనను తగ్గించుకుంటూ వస్తోంది. చంద్రబాబు మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. మొదట 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలకు అంగీకరించారు పవన్‌కల్యాణ్. అసలు 24 అసెంబ్లీ స్థానాలు అంగీకరించడాన్నే జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. గౌరవప్రదంగా 40కిపైగా స్థానాలు ఆశించారు. కానీ, పవన్ మాత్రం వారి ఆశలను, అభిప్రాయాలను పట్టించుకోకుండా దత్తతండ్రి చంద్రబాబు చెప్పినట్లు తలాడించారు. చివరకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు పార్టీని పరిమితం చేశారు.