సత్తెనపల్లిలో ఐదు ముక్కలాట
చంద్రబాబు బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. కాబట్టి కచ్చితంగా తమ్ముళ్ళ మధ్య బల ప్రదర్శన ఉంటుంది. అలాగే టికెట్ ప్రకటన విషయంలో తమ్ముళ్ళంతా చంద్రబాబుపై ఎవరి స్థాయిలో వాళ్ళు ఒత్తిడి తీసుకురావటం ఖాయం.
మామలూగా అయితే మూడు ముక్కాలట అనే మాట చాలా పాపులర్. కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని చూసిన తర్వాత ఐదు ముక్కలాట అని చెప్పక తప్పలేదు. విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో మూడు రోజులు పర్యటన పెట్టుకున్నారు. మంగళవారం పెదకూరపాడులో రోడ్డు షో జరిగింది. బుధవారం సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. పై మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల వచ్చే ఎన్నికలకు సంబంధించి తమ్ముళ్ళ మధ్య గట్టి పోటీనే ఉంది.
ఆ రెండు నియోజకవర్గాలు పెదకూరపాడు, సత్తెనపల్లి. వీటిల్లో కూడా సత్తెనపల్లి చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎలాగంటే ఇక్కడి నుంచే పోటీ చేయాలని కోడెల శివప్రసాదరావు కొడుకు కోడెల శివరామకృష్ణ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అతనికి టికెట్ ఇవ్వద్దని పార్టీలోని నేతలంతా ఏకమై చెప్పేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా శివరామ్‌కు స్పష్టంగా చెప్పారట. అయినా కోడెల వినిపించుకోకుండా నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు.
ఇక రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగారావు కూడా గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి వీరాంజనేయులు, యువనేత అబ్బూరి మురళి కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరి ప్రయత్నాలు ఒకవైపు సాగుతుండగానే హఠాత్తుగా కన్నా లక్ష్మీనారాయణ ఎంటరయ్యారు. బీజేపీ నుంచి టీడీపీలో చేరినప్పుడే సత్తెనపల్లి టికెట్ హామీ తీసుకునే వచ్చారని తమ్ముళ్ళు చెబుతున్నారు. పై నేతల మధ్య పంచాయితీలు సెటిల్ చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటంలేదు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. కాబట్టి కచ్చితంగా తమ్ముళ్ళ మధ్య బలప్రదర్శన ఉంటుంది. అలాగే టికెట్ ప్రకటన విషయంలో తమ్ముళ్ళంతా చంద్రబాబుపై ఎవరి స్థాయిలో వాళ్ళు ఒత్తిడి తీసుకురావటం ఖాయం. మిగిలిన ముగ్గురి సంగతి వదిలేసినా కోడెల, రాయపాటితో మాత్రం చంద్రబాబుకు చికాకులు తప్పేట్లు లేదు. ఎలాగంటే వీళ్ళకి టికెట్ ఇస్తే ఓడిపోతారు..ఇవ్వకపోతే ఓడగొడతారు అన్నట్లుందట వ్యవహారం. కోడెల, రాయపాటికి గెలిచేంత సీన్ లేదుకానీ టీడీపీ అభ్యర్థిని ఓడించేందుకు అవసరమైన బలం మాత్రం ఉందని పార్టీలోనే టాక్ నడుస్తోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.