Telugu Global
Andhra Pradesh

పులివెందుల కేబుల్ బ్రిడ్జ్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

క్రిస్మస్ కానుకగా పులివెందులలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించడం ద్వారా పట్టణానికి సరికొత్త శోభ వస్తుందని వైసీపీ ప్రచారం చేస్తోంది.

పులివెందుల కేబుల్ బ్రిడ్జ్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
X

పులివెందుల కేబుల్ బ్రిడ్జ్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో సుదీర్ఘ పర్యటన చేస్తున్నారు. క్రిస్మస్‌ను ప్రతీ ఏడాది సొంత ఊరిలో కుటుంబంతో జరుపుకునే అలవాటు ఉన్న జగన్.. ఈ ఏడాది కూడా పులివెందుల వెళ్లారు. ముందుగా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన జగన్.. పులివెందుల టౌన్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బస్టాండ్, కూరగాయల మార్కెట్, కదిరి జంక్షన్‌ను ఓపెనింగ్ చేశారు. ఇక పులివెందులలోని రాయలపురం బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు.

క్రిస్మస్ కానుకగా పులివెందులలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించడం ద్వారా పట్టణానికి సరికొత్త శోభ వస్తుందని వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తమ పార్టీ అధికారిక వైసీపీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. కేబుల్ బ్రిడ్జిని చూసిన నెటిజన్లు దానిపై సెటైర్లు వేస్తున్నారు. ముందుగానే నిర్మించిన బ్రిడ్జికి కేబుల్స్ తగిలిస్తే కేబుల్ బ్రిడ్జి అయిపోతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని అనుకరిస్తే ఇలాగే ఉంటుందని విమర్శిస్తున్నారు.

దుర్గం చెరువు బ్రిడ్జి, పులివెందుల బ్రిడ్జిల ఫొటోలను పక్కపక్కన పెట్టి.. రెండింటికీ ఉన్న తేడాను చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నది ఒరిజినల్ పూమా.. పులివెందులలో ఉన్నది డూప్లికేట్ పోమా అంటూ ట్విట్టర్‌లో ఫొటోలు షేర్ చేస్తున్నారు. ప్రారంభానికి ముందే ఒక కేబుల్ తెగిపోయి వ్రేలాడుతుండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పులివెందులలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌కు ఈ పులివెందుల కేబుల్ బ్రిడ్జి ఒక మచ్చలా తయారయ్యింది.

ఒక మామూలు బ్రిడ్జికి కేబుల్స్ తగిలించాలనే ఆలోచన ఎవరికి వచ్చిందని? దానికి జగన్ ఎలా ఓకే చెప్పారనే డౌట్లు కూడా వస్తున్నాయి. మొత్తానికి ప్రతిపక్ష పార్టీలకు పులివెందుల బ్రిడ్జ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న కోపాన్నంతా పులివెందుల కేబుల్ బ్రిడ్జిపై చూపిస్తున్నారు. మరి దీనికి వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.



First Published:  24 Dec 2022 6:25 PM IST
Next Story